పాదయాత్ర ఆపేయాలని బండికి అధిష్టానం ఆదేశం! అసలు కారణం ఏంటి?

ప్రజా సంగ్రామ యాత్ర కారణంగా బీజేపీకి ఎలాంటి మైలేజ్ పెరగడం లేదని అధిష్టానం భావిస్తోంది. ఇటీవల యాత్ర ముగిసిన నియోజకవర్గాల్లో సర్వే చేయగా.. పెద్దగా ఫలితం లేనట్లు తేలింది.

Advertisement
Update:2022-12-01 08:24 IST

బీజేపీ పార్టీ ఫోకస్ అంతా ఇప్పుడు తెలంగాణపైనే ఉన్నది. రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి.. ఓటు బ్యాంకు మాత్రం లేదు. మూడోంతుల నియోజకవర్గాల్లో కనీసం బీజేపీ నాయకులు ఎవరో కూడా సామాన్యులకు తెలియదు. దీంతో ముందుగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర నాయకత్వం ప్రయత్నిస్తోంది. అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తన వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాలో హల్ చల్ చేశారు. కానీ, క్షేత్ర స్థాయిలో బీజేపీని బలోపేతం చేయాలంటే అది సరిపోదని భావించి.. ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించారు.

ఇప్పటి వరకు నాలుగు విడతల్లో ప్రజా సంగ్రామ యాత్రను పూర్తి చేశారు. ఉమ్మడి పాలమూరుతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి జిల్లాల్లో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగింది. ప్రస్తుతం ఐదో విడత పాదయాత్ర ఉమ్మడి అదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కొనసాగుతున్నది. డిసెంబర్ 17న ఈ యాత్ర కరీంనగర్‌లో ముగుస్తుంది. అయితే బండి సంజయ్ పాదయాత్రపై బీజేపీ అధిష్టానం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రజా సంగ్రామ యాత్రను ముగించేయాలని బండి సంజయ్‌కు అగ్రనాయకత్వం చెప్పినట్లు బీజేపీ వర్గాలు అంటున్నాయి.

ప్రజా సంగ్రామ యాత్ర కారణంగా బీజేపీకి ఎలాంటి మైలేజ్ పెరగడం లేదని అధిష్టానం భావిస్తోంది. ఇటీవల యాత్ర ముగిసిన నియోజకవర్గాల్లో సర్వే చేయగా.. పెద్దగా ఫలితం లేనట్లు తేలింది. పైగా యాత్రలో బండి చేసే కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి మైనస్‌గా మారుతున్నాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ స్థానిక పోలీసులు అనుమతి ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ప్రతీ సారి హైకోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకోవల్సి వస్తోంది. హైకోర్టు కూడా బండికి షరతులతో కూడిన అనుమతులే ఇస్తోంది. సభలు, సమావేశాలు కూడా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో నిర్వహించేందుకు అనుమతి నిరాకరించింది.

మరోవైపు బండి పాదయాత్రకు అనుకున్నంత ప్రజాదరణ కూడా ఉండటం లేదు. బీజేపీ శ్రేణులు తప్ప స్థానికులు అసలు యాత్రను పట్టించుకోవడం లేదు. రాష్ట్ర అధ్యక్షుడు పాదయాత్ర చేస్తున్నా.. కొన్ని ప్రాంతాల్లో స్థానిక కార్యకర్తలు కూడా పాల్గొనడం లేదని గుర్తించారు. ఇటీవల హైదరాబాద్‌లో నాలుగో విడత యాత్ర నిర్వహించారు. ఆ సమయంలో స్థానిక బీజేపీ కార్పొరేటర్లు పార్టీ కార్యకర్తలను బతిమిలాడి పిలిచినా పెద్దగా స్పందించలేదు. మునుగోడు ఉపఎన్నిక పేరుతో కొన్నాళ్లు యాత్రకు విరామం ఇచ్చారు.

భైంసాలో గతంలో జరిగిన ఉద్రిక్తలను దృష్టిలో పెట్టుకొని అక్కడ నుంచి ఐదో విడత పాదయాత్ర చేయాలని బండి భావించారు. అయితే హైకోర్టు మాత్రం భైంసాలో సభ నిర్వహించడానికి నిరాకరించడంతో పట్టణం వెలుపలే తూతూ మంత్రంగా కానిచ్చారు. రాష్ట్రంలో పార్టీని నడిపించాల్సిన వ్యక్తి.. పాదయాత్ర పేరుతో తిరుగుతుండటంతో కార్యకలాపాలకు ఇబ్బంది కలుగుతున్నట్లు బీజేపీ అధిష్టానం భావిస్తోంది. అందుకే ఫిబ్రవరి లోపు యాత్రను ముగించేయాలని ఆదేశించినట్లు తెలుస్తున్నది.

వాస్తవానికి బండి సంజయ్ వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ వరకు రాష్ట్రమంతటా ప్రజా సంగ్రామ యాత్ర చేయాలని భావించారు. కానీ ఇప్పుడు ఫిబ్రవరిలోపే యాత్ర ఆపేయాలని అధిష్టానం ఆదేశించడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఫిబ్రవరి లోపు మిగిలిన నియోజకవర్గాలన్నీ కవర్ చేయడం కష్టమే. అలా అని అధిష్టానం మాటను పక్కన పెట్టి యాత్ర చేయలేరు. అందుకే బండి సంజయ్ ప్రత్యామ్నాయలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది.

బస్సు యాత్రలు, పాదయాత్రలతో పని కాదని.. ముందుగా చేరికలపై దృష్టి పెట్టాలని అధిష్టానం సూచించినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా పలునియోజకవర్గాల్లో కీలక నేతలను పార్టీలోకి తీసుకొని రావడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించినట్లు తెలుస్తున్నది. వచ్చే ఏడాది మేలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ బీజేపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు సీఎం కేసీఆర్ ముందస్తు లేదని స్పష్టం చేసినా.. బీజేపీ మాత్రం ఆ ప్రచారం మానడం లేదు. ఇతర పార్టీల్లోని నాయకులను త్వరగా బీజేపీలోకి తీసుకొని రావాలనే వ్యూహంలో భాగంగానే ఆ ప్రచారం చేస్తున్నట్లు కూడా తెలుస్తున్నది. యాత్ర వల్ల లాభం లేకపోవడంతోనే చేరికలను ప్రాధాన్యతగా అధిష్టానం తీసుకున్నది. మొత్తానికి బండి సంజయ్ యాత్రను ఆపేసి.. ఇక చేరికలపై దృష్టి పెట్టే అవకాశం ఉన్నది.

Tags:    
Advertisement

Similar News