బీజేపీ టార్గెట్ తలసాని.? మర్రి శశిధర్‌రెడ్డిని చేర్చుకోవడం వెనుక భారీ వ్యూహం!
తలసానికి పోటీగా బీజేపీ తరపున శశిధర్ రెడ్డి నిలబడితే మాత్రం పోటీ రసవత్తరంగా ఉంటుంది. తప్పకుండా కాంగ్రెస్‌ను తప్పించేసి టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తెలంగాణలో పాగా వేయాలని ఆరాటపడుతున్న బీజేపీ తమ వ్యూహాలకు పదును పెడుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సరైన నాయకుల కోసం వెతుకుతున్నది. ఇతర పార్టీల్లో సీనియర్ నాయకులకు గాలం వేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీగా సీట్లు గెలుచుకోవడం ద్వారా అధికారానికి దగ్గర కావాలని చూస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి ఓటు బ్యాంకు లేదని గ్రహించిన బీజేపీ.. సాధ్యమైనంతగా అర్బన్ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడం ద్వారా సీట్లు గెలవాలని భావిస్తోంది. ఇక టీఆర్ఎస్ పార్టీలోని కీలకమైన మంత్రులు, నాయకులు ఉన్న చోట్ల ప్రత్యేక వ్యూహాన్ని అమలు పరుస్తోంది.
జీహెచ్ఎంసీ పరిధిలోని సనత్‌నగర్ అసెంబ్లీ సెగ్మెంట్‌ను బీజేపీ టార్గెట్ చేసింది.ముఖ్యంగా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ను ఓడించి పై చేయి సాధించాలని భావిస్తోంది. 2014లో బీజేపీ మద్దతుతోనే టీడీపీ ఎమ్మెల్యేగా తలసాని గెలిచారు. ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరి ఏకంగా మంత్రి అయ్యారు. ఆ తర్వాత బీజేపీ టార్గెట్‌గా తలసాని పలు విమర్శలు చేశారు. తమ మద్దతుతో గెలిచి మంత్రి అయిన వ్యక్తి.. చివరకు తమ పార్టీనే టార్గెట్ చేయడంతో బీజేపీ నేతల్లో ఆగ్రహం తెప్పించింది. గత ఎన్నికల్లో తలసాని టీఆర్ఎస్ టికెట్‌పై పోటీ చేశారు. అదే సమయంలో పొత్తులో భాగంగా ఇక్కడి టికెట్ కాంగ్రెస్‌కు కాకుండా, టీడీపీకి లభించింది. బీజేపీ కూడా భవర్‌లాల్ వర్మను పోటీకి నిలిపింది. కానీ తలసాని 30 వేలకు పైగా మెజార్టీతో గెలిచారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ గత సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున తన కుమారుడు సాయిని సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయించారు. బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డిని ఓడించడానికి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, సాయికి అనుభవం లేదనే కారణంతో ఓటర్లు చాలా మంది కిషన్ రెడ్డికి ఓటేసి గెలిపించారు. అయినా సరే 2014లో పోలిస్తే.. 2019తో బీజేపీకి ఓట్లు గణనీయంగా తగ్గిపోయాయి. అప్పట్లో బండారు దత్తాత్రేయ 2.5 లక్షల ఓట్లకు పైగా మెజార్టీతో గెలిచారు. కానీ కిషన్ రెడ్డి 60వేల ఓట్లతో బయటపడ్డారు. బీజేపీకి ఓట్లు గణనీయంగా తగ్గిపోవడానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ కారణమని బీజేపీ అంచనాకు వచ్చింది. అందుకే ఈ సారి ఆయన ఓటమికి పకడ్బంధీ వ్యూహం సిద్ధం చేసింది.
మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ దక్కలేదని మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. పొత్తులో భాగంగా ఆ టికెట్‌ను కావాలనే టీడీపీకి వచ్చేలా రేవంత్ రెడ్డి పావులు కదిపినట్లు శశిధర్ రెడ్డి భావిస్తున్నారు. సనత్‌నగర్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మర్రి శశిధర్ రెడ్డిని పార్టీలో చేర్చుకుంటే లాభం ఉంటుందని బీజేపీ భావించింది. తలసానికి సరైన పోటీ శశిధర్ రెడ్డి ఇవ్వగలరని అంచనా వేసింది. అందుకే కాంగ్రెస్‌లో అసంతృప్తిగా ఉన్న శశిధర్ రెడ్డిని పార్టీలోకి రప్పించడంలో సఫలం అయ్యింది. శశిధర్ శుక్రవారం బీజేపీలో చేరే అవకాశం ఉన్నది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తలసానికి పోటీగా శశిధర్ రెడ్డిని బరిలోకి దింపుతారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
సనత్‌నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని కొన్ని డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్లు గెలిచారు. బీజేపీకి ఈ సెగ్మెంట్ పరిధిలో 2018తో పోలిస్తే ఓటు బ్యాంకు పెరిగినట్లు జీహెచ్ఎంసీ ఎన్నికల ద్వారా స్పష్టం అయ్యింది. ఇక శశిధర్ రెడ్డికి కాంగ్రెస్ ఓట్లు కూడా పడే అవకాశం ఉంటుంది. కాగా, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సనత్‌నగర్‌లో టీఆర్ఎస్ హయాంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా అంతర్గత రోడ్ల విషయంలో తలసాని ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. జీహెచ్ఎంసీ నుంచి నిధులు రాబట్టడంతో సఫలం అయ్యారు. ప్రజల్లో కూడా తలసానిపై పెద్దగా వ్యతిరేకత లేదు. అయితే ఈ సారి తలసానికి పోటీగా బీజేపీ తరపున శశిధర్ రెడ్డి నిలబడితే మాత్రం పోటీ రసవత్తరంగా ఉంటుంది. తప్పకుండా కాంగ్రెస్‌ను తప్పించేసి టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.