లీకులిచ్చింది రాజాసింగేనా..? ఇప్పుడు కవరింగ్ ఎందుకు..?
బీజేపీలో చేరక ముందు రాజాసింగ్ టీడీపీ తరపున జీహెచ్ఎంసీ కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. ఆ పాత పరిచయాలతోనే ఆయన టీడీపీలో చేరతారంటూ కథనాలు వచ్చాయి.
బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే రాజాసింగ్ టీడీపీలో చేరుతున్నారని కథనాలొచ్చాయి. టీడీపీ అనుకూల మీడియాలోనే ఈ వార్త రావడంతో అంతా నిజమేననుకున్నారు. కానీ, అవన్నీ వట్టి పుకార్లేనని కొట్టిపారేశారు రాజాసింగ్. తాను పార్టీ మారట్లేదని క్లారిటీ ఇచ్చారు.
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్. ఆ తర్వాత ఇద్దరు, ఆయనకు తోడు దొరికారు. కానీ తొలి ఎమ్మెల్యేపైనే పార్టీ వేటు వేసింది. ఆయన జైలుకెళ్లి తిరిగొచ్చినా ఆ సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఈ దశలో బీజేపీపై ఆయన అలకబూనారని, పార్టీని వదిలేస్తున్నారని, టీడీపీలో చేరుతున్నారని.. ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. దీనిపై తాజాగా రాజాసింగ్ స్పందించారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
టీడీపీలో చేరుతున్నారన్న వార్తలు అవాస్తవం అంటూ మీడియాకి తెలియజేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. బీజేపీలోనే కొనసాగుతానన్నారు. వచ్చే ఎన్నికల్లో గోషామహల్ స్థానం నుంచి పోటీ చేస్తానని చెప్పారు. తన మెంటాలిటీకి బీజేపీ తప్ప వేరే పార్టీ సెట్ కాదు అంటున్నారు. మరి బీజేపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.
లీకులెందుకు..?
బీజేపీలో చేరక ముందు రాజాసింగ్ టీడీపీ తరపున జీహెచ్ఎంసీ కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. ఆ పాత పరిచయాలతోనే ఆయన టీడీపీలో చేరతారంటూ కథనాలు వచ్చాయి. సస్పెన్షన్ తర్వాత బీజేపీ పట్టించుకోవడం లేదని, అందుకే ఆయన పార్టీ మారతారని, ఈ మేరకు ఇప్పటికే టీడీపీ నేతలతో చర్చలు జరిపారంటూ వార్తలు రాశారు. పార్టీ మారాలనుకునే నాయకులు చివరి వరకూ.. ఇలాంటి కబుర్లు చెబుతారనేది బహిరంగ రహస్యం. అయితే రాజాసింగ్ చివరకు టీడీపీలో చేరతారనంటేనే ఎవరికీ నమ్మకం కుదరట్లేదు. అంతలోనే బయటకొచ్చి పుకార్లను కొట్టిపారేశారు రాజాసింగ్. ముందు ముందు ఈ వార్తల్లో ఎంత నిజముందో తేలిపోతుంది.