బీజేపీకి తెలంగాణలో అభ్యర్థులు కావలెను..!

తెలంగాణలో 119 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా.. అందులో సగానికి పైగా నియోజకవర్గాల్లో బీజేపీకి సరైన అభ్యర్థులు దొరకడం లేదని సమాచారం. దీంతో ఇతర పార్టీల నాయకులను ఆకర్షించే పనిలో పడింది బీజేపీ.

Advertisement
Update:2022-07-29 21:07 IST

తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి బీజేపీకి అభ్యర్థులు కావలెను.. అవును మీరు చదివింది నిజమే. కేంద్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ, ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న పార్టీ అయిన బీజేపీకి తెలంగాణలో అభ్యర్థులు కరువయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో జెండా పాతాలి అనే లక్ష్యంతో ఉన్న బీజేపీ.. హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశాలు, మోడీ బహిరంగ సభ అనంతరం మరింత దూకుడుగా దూసుకొని పోతోంది. జాతీయ నాయకత్వం అంతా తెలంగాణకు రావడం, రెండు రోజులు ప్రతీ నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహించడంతో కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది.

తెలంగాణలో 119 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా.. అందులో సగానికి పైగా నియోజకవర్గాల్లో బీజేపీకి సరైన అభ్యర్థులు దొరకడం లేదని సమాచారం. ఇటీవల జాతీయ నాయకత్వం తెలంగాణకు సంబంధించి పలు సర్వేలు, రిపోర్టులు తెప్పించుకుంది. అందులో అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయడానికి సరైన అభ్యర్థులు లేనట్లు తేలడంతో అధిష్టానం ఆందోళన చెందుతోంది. జనాలకు తెలిసిన, పాపులర్ నాయకులు లేకపోవడం బీజేపీకి పెద్ద అవరోధంగా మారింది. ఇప్పుడు ఉన్న నియోజకవర్గాల ఇన్‌చార్జులకు టికెట్లు ఇస్తే గెలిచే అవకాశం లేద‌ని సర్వేలు తేల్చాయి. దీంతో ఇతర పార్టీల నాయకులను ఆకర్షించే పనిలో పడింది బీజేపీ.

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర రెండు దశల్లో చెప్పుకోదగిన స్థాయిలో చేరికలు ఏమీ లేవు. దీంతో ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానున్న మూడో దశ పాదయాత్రలో భారీగా ఇతర పార్టీ నుంచి కీలక నాయకులను చేర్పించాలని అధిష్టానం సూచించింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తులతో పాటు.. టికెట్ రాదని అనుమానం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చేలా వ్యూహాలు రచిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న నాయకులకు ప్రజల్లో అంతగా పలుకుబడి లేనందువల్లే.. జనాలకు తెలిసిన నాయకులను పార్టీలో చేర్చుకొని టికెట్ ఇవ్వాలని భావిస్తోంది.

కేంద్ర నాయకత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. రాష్ట్రంలో చేరికలు లేకపోవడంపై ఇప్పటికే అధిష్టానం ఆగ్రహంతో ఉంది. ఎన్నికల నాటికి బీజేపీకి బలమైన అభ్యర్థులను తయారు చేసుకోవడం చాలా కష్టం. అందుకే ఆయా నియోజకవర్గాల్లో చరిష్మా ఉన్న నాయకులను పార్టీలో చేర్చుకోవాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించింది. అందుకే రాష్ట్రాన్ని నాలుగు క్లస్టర్లుగా విభజించడమే కాకుండా.. టీఆర్ఎస్ నుంచి వచ్చిన ఈటలకు జాయినింగ్స్ కమిటీ బాధ్యతలు అప్పగించింది. ఈ నెల 27 తర్వాత భారీగా చేరికలు ఉంటాయని ఈటల బల్లగుద్ది మరీ చెప్పారు. ఆయన చెప్పిన డేట్ దాటి రెండు రోజులైనా కనీసం ఒక వార్డు మెంబర్ కూడా జాయిన్ కాకపోవడంపై అధిష్టానం సీరియస్‌గా ఉందని సమాచారం.

దక్షిణ తెలంగాణ నియోజకవర్గాల్లో బీజేపీకి సరైన అభ్యర్థులు లేనందునే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై కన్నేసిందని కూడా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన మాత్రం ఎటూ తేల్చకుండా నాన్చుతున్నారు. ఈ విషయం బీజేపీని ఇబ్బంది పెడుతుంది. ఇతర పార్టీల నుంచి పాపులర్ నాయకులు చేరకపోతే మాత్రం.. బీజేపీకి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు దొరకడం కష్టమే అని తెలుస్తుంది. మరి కొత్త అభ్యర్థుల అన్వేషణ కోసం అధిష్టానం ప్లాన్ బీ ఏమైనా అమలు చేస్తుందా అనేది వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News