కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఏడాదే.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, వాటిని అమలు చేయడం సాధ్యం కాదని రాజాసింగ్ చెప్పారు.

Advertisement
Update:2023-12-06 17:53 IST

తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్త‌ల్లో నిలిచే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి త‌న మార్క్ కామెంట్స్‌తో సంచలనం రేపారు. తెలంగాణలో ఒకవైపు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా.. ఆ ప్రభుత్వం ఉండేది ఏడాది మాత్రమేనని.. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం వస్తుందని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్తగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారం చేపట్టకముందే రాజాసింగ్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.

తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 సీట్లు సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. రేపు మధ్యాహ్నం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎంగా ఎవరు ఎంపిక అవుతారు.. మంత్రివ‌ర్గంలో ఎవ‌రెవ‌రికి అవ‌కాశం దక్కుతుంది..? అని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తుంటే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఏడాది మాత్రమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, వాటిని అమలు చేయడం సాధ్యం కాదని రాజాసింగ్ చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేని పరిస్థితి ఉందని, ఇక పథకాల అమలుకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని ఆయన ప్రశ్నించారు.

రాజ్యాంగాన్ని కేసీఆర్ మారుస్తానంటే.. ప్రజలే కేసీఆర్‌ను మార్చారన్నారు. కేసీఆర్ అప్పులు చేసి వెళ్లారని.. వాటిని పూడ్చడంతోనే కాంగ్రెస్ కు సరిపోతుందని చెప్పారు. తెలంగాణను నడపాలంటే ఒక్క బీజేపీతోనే సాధ్యమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది మాత్రమే అధికారంలో ఉంటుందని.. ఆ తర్వాత రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

Tags:    
Advertisement

Similar News