తెలంగాణలో మార్పు తీసుకొచ్చే సత్తా బండి సంజయ్‌కే ఉంది.. - ప్రకాశ్‌ జవదేకర్

ప్రజా సంగ్రామ యాత్రతో బండి సంజయ్ తెలంగాణలో పార్టీని బలోపేతం చేశారన్నారు. తెలంగాణలో మార్పు తీసుకొచ్చే సత్తా బండి సంజయ్‌కే ఉందనే నమ్మకం తనకుందన్నారు.

Advertisement
Update:2023-06-12 15:39 IST

తెలంగాణలో మార్పు తీసుకొచ్చే సత్తా బండి సంజయ్‌కి ఉందని కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. బీజేపీ మహజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండ జిల్లాల అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, దూది శ్రీకాంత్, రావు పద్మ, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావులతో కలిసి హుస్నాబాద్ నియోజకర్గంలోని కోహెడ మండలం సముద్రాల గ్రామాన్ని సందర్శించారు. ఎల్కతుర్తి-సిద్దిపేట జాతీయ రహదారి విస్తరణ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. ప్రజా సంగ్రామ యాత్రతో బండి సంజయ్ తెలంగాణలో పార్టీని బలోపేతం చేశారన్నారు. తెలంగాణలో మార్పు తీసుకొచ్చే సత్తా బండి సంజయ్‌కే ఉందనే నమ్మకం తనకుందన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎలాగో.. బండి సంజయ్ కూడా అలాగే ఉన్నాడని.. వీరిద్ద‌రూ పని మొదలు పెడితే పూర్తి చేసి తీరుతారని చెప్పారు. మోదీ ప్రభుత్వం ఏర్పడి 9 ఏళ్లు పూర్తయినందున మహజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తాను ఇక్కడికి వచ్చానని, అందులో భాగంగా ఎల్కతుర్తి –సిద్దిపేట జాతీయ రహదారి విస్తరణ పనులను పరిశీలించినట్టు చెప్పారు. ఈ రహదారి పనులు పూర్తయితే సిద్దిపేట, హుస్నాబాద్, ముల్కనూర్, ఎల్కతుర్తి సహా 14 గ్రామాల ప్రజలకు ఉపయోగపడుతుందని తెలిపారు.

కాంగ్రెస్ పాలనలో రోడ్లు వేస్తే ఏడాది దాటితే దెబ్బతింటాయని విమర్శించారు. వాజ్‌పేయ్‌ హయాంలో నాణ్యతకు ప్రాధాన్యతనిచ్చి జాతీయ రహదారుల పనులు చేపట్టామని, 5 ఏళ్ల పాటు రోడ్లు దెబ్బతిన్నా కాంట్రాక్టర్ భరించేలా నిబంధన విధించినట్టు తెలిపారు. మోదీ పాలనలో నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ పనులు చేపడుతున్నామన్నారు. 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 14 ఎంపీ సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ప్రకాశ్‌ జవదేకర్.

Tags:    
Advertisement

Similar News