రేవంత్ ప్రభుత్వాన్ని బీజేపీ కాపాడుతోంది
అమృత్ అక్రమాలపై మహేశ్వర్ రెడ్డి మాట్లాడితే నోరు మూయించారు : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రయ్తనిస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. అమృత్ టెండర్లలో అక్రమాలపై బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడితే కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఆయన నోరు మూయించారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏ చిన్న ఘటన బయట పడినా విచారణ సంస్థలను ఉసిగొల్పుతున్న బీజేపీ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్రమాలకు కొమ్ము కాస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రేమ కథ నడుస్తోందన్నారు. అందుకే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే రాజాసింగ్ సీఎం రేవంత్ శుద్ధపూస అన్నట్టుగా మాట్లాడుతున్నారని అన్నారు. రేవంత్ ప్రభుత్వం అమృత్ టెండర్లలో రూ.8,888 కోట్ల భారీ కుంభకోణానికి తెరతీసిందని ఆరోపించారు. సీఎం బావమరిది సృజన్ రెడ్డి కంపెనీకి అర్హతలు లేకున్నా రూ.వేల కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టారని తెలిపారు. ఇండియన్ హ్యూమ్ పైప్ అనే సంస్థను అడ్డం పెట్టుకొని అక్రమాలకు తెరతీశారన్నారు. ఈ అక్రమాలపై సీఎం రేవంత్ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమాలకు తెరతీసిన ఎందరో తమ పదవులను కోల్పోయారని, అదే పరిస్థితి రేవంత్ ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. సీఎం తన ఇంట్లోని లంకె బిందెలను నింపుకోవడం కోసమే అక్రమ టెండర్లకు తెరతీశారని తెలిపారు. ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీకి ఇచ్చిన సమాచారంతోనే సృజన్ రెడ్డి కంపెనీకి టెండర్లు దక్కిన విషయం బయట పడిందన్నారు. ప్రభుత్వం ఈ టెండర్ల ప్రక్రియకు సంబంధించిన చిన్న కాగితం కూడా బయటకు రానివ్వడం లేదన్నారు. ఈ టెండర్లలో అక్రమాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బయట పెట్టకుంటే కాంగ్రెస్ తో కుమ్మక్కు రాజకీయాలు తేటతెల్లం అయినట్టేనని అన్నారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే అమృత్ టెండర్లు రద్దు చేయాలని, విచారణ చేపట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.