కేసీఆర్ వ్యూహానికి సమాధానం వెతుక్కుంటున్న బీజేపీ
తాజాగా, తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అంతకంటే ముందే.. కొత్త పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం గమనార్హం.
రాజకీయం అంటే ఎదుటి పార్టీని విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేయడమో.. నిందారోపణలు చేసి కడిగిపారేయడమో కాదు. ఎదుటి పార్టీ చేయడానికి ఇష్టపడని పనులను కూడా నడుం వంచి చేయించడం. ఇలా ప్రత్యర్థి పార్టీని ఇరుకున పెట్టి మైలేజీ పొందడం రాజకీయాల్లో కొందరికి వెన్నతో పెట్టిన విద్య. ఆ కోవలోకే తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా వస్తారు. రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ వేసే ఎత్తుగడలు, పన్నే వ్యూహాలు ఆయన సన్నిహితులకు కూడా అంత త్వరగా అర్థం కావు. ఆయన ఓ నిర్ణయం తీసుకుంటే.. భవిష్యత్‌లో జరగబోయే లాభనష్టాలను కూడా బేరీజు వేసుకుంటారు. తాజాగా, తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అంతకంటే ముందే.. కొత్త పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం గమనార్హం.
ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీలో పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తున్నారు. ఓ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి మరీ కేంద్రానికి పంపితే.. దానిపై తప్పకుండా పార్లమెంటులో చర్చ జరుగుతుంది. తెలంగాణ అసెంబ్లీ డిమాండ్ మేరకు పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలా వద్దా అనేది ఎన్డీయే ప్రభుత్వం చేతిలో ఉన్నది. ఇప్పుడు ఆ నిర్ణయానికి మోడీ ప్రభుత్వం ఓకే చెప్పినా.. చెప్పక పోయినా టీఆర్ఎస్‌కే లాభం కలుగుతుంది. ఒక వేళ పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెడితే ఆ ఘనత తమదే అని తెలంగాణ ప్రభుత్వం ప్రచారం చేసుకునే వీలుంటుంది. ఆ తీర్మానాన్ని పక్కకు పెడితే.. దళితుల మీద మోడీకి ప్రేమ లేదంటూ రాజకీయ అస్త్రంగా వాడుకునే వెసులు బాటు కూడా ఉంది. కేసీఆర్ పన్నిన ఈ వ్యూహానికి ప్రస్తుతం బీజేపీ వద్ద సమాధానమే లేకుండా పోయింది.
పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలనే అంశంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు బీజేపీ ఎమ్మెల్యే రఘునందర్ రావు సభలో లేరు. ఈ విషయాన్ని ఇప్పటికే మంత్రి కేటీఆర్ హైలైట్ చేస్తున్నారు. బీజేపీకి దళితులన్నా, రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ అన్నా గౌరవం లేదని, అందుకే సభలో కీలకమైన అంశంపై చర్చ జరుగుతుంటే బీజేపీ ఎమ్మెల్యే బయటకు జారుకున్నారని విమర్శిస్తున్నారు. తమకు సంబంధం లేని హైదరాబాద్ విలీన అంశాన్ని ప్రచారానికి బీజేపీ వాడుకుంటున్నప్పుడు.. దళితులకు ఎన్నో పథకాలు తీసుకొని వచ్చిన టీఆర్ఎస్ పార్టీ అంబేద్కర్ పేరును వాడుకోవడంలో తప్పులేదని నాయకులు వాదిస్తున్నారు.
గుజరాత్‌లో వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని నెలకొల్పి బీజేపీ మైలేజీ పొందుతున్నదని, అలాగే ట్యాంక్‌బండ్ సమీపంలో భారీ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పి దళితులను ఆకర్షించాలని టీఆర్ఎస్ భావిస్తున్నది. ఇప్పటికే దళిత బంధు పథకం రాష్ట్రంలో మాదిరిగానే.. దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పినట్లుగానే.. భవిష్యత్‌లో దళిత బంధు పథకంపై కూడా నిర్ణయం తీసుకుంటారని తెలుస్తున్నది. బీజేపీ అధినాయకత్వం చేపడుతున్న ప్రతీ కార్యాచరణకు తనదైన శైలిలో కేసీఆర్ స్పందిస్తున్నారు. ఆజాదీ కా అమృతోత్సవ్‌లో భాగంగా మోడీ ప్రభుత్వం 'హర్ ఘర్ తిరంగా' పేరుతో కార్యక్రమం చేపట్టింది. దానికి బదులుగా కేసీఆర్ 'ఇంటింటికీ జెండా' నినాదంతో హైజాక్ చేసేశారు. ఇప్పుడు సెప్టెంబర్ 17ను విమోచన దినంగా బీజేపీ చేస్తుంటే.. జాతీయ సమైక్యతా దినోత్సవం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలు నిర్వహిస్తోంది.
కేంద్రంలోని బీజేపీ, మోడీ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్న కేసీఆర్.. తాజాగా అంబేద్కర్ పేరు పెట్టాలనే డిమండ్‌తో ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఎదుటి పక్షానికి విమర్శించే అవకాశం ఇవ్వకుండా సచివాలయానికి అంబేద్కర్ పేరు కూడా పెట్టారు. ఇప్పుడు బంతి బీజేపీ కోర్టులోనే ఉన్నది. ఇది చాలా సున్నితమైన అంశం కావడంతో బీజేపీ నాయకులు ఎవరు బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. కానీ ఈ అంశం తప్పకుండా టీఆర్ఎస్‌కు రాజకీయ అస్త్రంగా మారుతుందని మాత్రం అంచనా వేస్తోంది.