తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది.. నిజామాబాద్‌లో పీఎం నరేంద్ర మోడీ
బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో అభివృద్ధికే కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్లు, ఆసుపత్రుల నిర్మాణానికి ఇప్పటికే కేంద్రం అనుమతులు ఇచ్చింది. చాలా కార్యక్రమాలు ఇప్పటికే పురోగతి సాధించాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో బీజేపీకి ఆధిక్యత కట్టబెట్టడంతో మాపై మరింత బాధ్యత పెరిగింది. ఇకపై తెలంగాణలో బీజేపీ గట్టిగా పోరాడాలనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన బీజేపీ జనగర్జన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోడీ అనేక విషయాలు వెల్లడించారు.
నేను ఈ రోజు మీకు 100 శాతం నిజాలు చెప్పాలని అనుకుంటున్నాను. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ తన దగ్గరకు వచ్చారు. తాము ఎన్డీయేలో చేరతామని, తన కుమారుడు కేటీఆర్‌ను ఆశీర్వదించాలని కోరారు. అయితే ఇది రాజరికం కాదని, బీఆర్ఎస్‌తో పొత్తుపెట్టుకునే ఆసక్తి లేదని తాను స్పష్టం చేసినట్లు ప్రధాని మోడీ వెల్లడించారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని మోడీ ఆరోపించారు.
కాగా, బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో అభివృద్ధికే కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఎంతో మంది బలిదానాలతో తెలంగాణ సాకారం అయ్యింది. తెలంగాణ ఏర్పడిన ప్రతిఫలం ప్రతీ ఒక్కరికి అందాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ అన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించాలని కోరారు. తెలంగాణలోని తల్లులు, చెల్లెమ్మలు బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. తెలంగాణ యువత కూడా మరోసారి కుటుంబ పాలనకు అవకాశం ఇవ్వొద్దని చెప్పారు.
కాగా, ఈ సభలో పాల్గొన్న మోడీకి నిజామాబాద్ రైతులు కొందరు పసుపు కొమ్ములతో దండ వేసి, పసుపు చెట్ల బొకేను అందించారు. రెండు రోజుల క్రితమే నిజామాబాద్‌కు పసుపు బోర్డు మంజూరు చేయనున్నట్లు మహబూబ్‌నగర్‌లో ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే.