బీఆర్ఎస్‌పై కామెంట్లు చేసిన మంత్రి కిషన్‌రెడ్డికి బీజేపీ అధిష్టానం మందలింపు
దేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, పార్టీ పేరు మార్చుకోవచ్చు.. అలాంటి విషయాల్లో అనవసరంగా నోరు జారవద్దని చెప్పినట్లు తెలుస్తోంది.
తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన ఏర్పాటు చేయనున్న భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి జి. కిషన్ రెడ్డిని బీజేపీ అధిష్టానం మందలించింది. కొత్త పార్టీ ప్రకటన చేయక ముందే, వారి అజెండా ఏంటో తెలియక ముందే ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేయడం తగదని హెచ్చరించింది. దేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, పార్టీ పేరు మార్చుకోవచ్చు.. అలాంటి విషయాల్లో అనవసరంగా నోరు జారవద్దని చెప్పినట్లు తెలుస్తోంది. ఏదైనా పార్టీ విధి విధానాలపై విమర్శలు ఉండాలి తప్ప.. పార్టీ ఏర్పాటుపై ఆరోపణలు చేయడం మంచిది కాదని మంత్రిని హెచ్చరించినట్లు సమాచారం.
ఇటీవల మీడియాతో మాట్లాడిన మంత్రి కిషన్ రెడ్డి.. బీఆర్ఎస్ ఏర్పాటుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మోటర్ సైకిల్ వేసుకొని ప్రగతి భవన్‌కు వెళ్లారు. ఆ తర్వాత ఇద్దరూ కలసి ఫెడరల్ ఫ్రంట్ పెడదామనుకున్నారు. విమానం అద్దెకు తీసుకొని దేశమంతా చుట్టేయాలని అనుకున్నారు. కానీ అది వర్కవుట్ కాలేదు. ఇటీవల మళ్లీ ఓవైసీ.. సీఎం కేసీఆర్‌ను కలిశారు. వెంటనే జాతీయ పార్టీ పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఈ సారి విమానం అద్దెకు కాకుండా కొనుక్కోవాలని అనుకున్నారు. వీళ్లిద్దరూ కలసి విమానంలో దేశమంతా తిరిగి మోడీ ప్రభుత్వాన్ని పడగొడతారంటా అని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ గతంలో అనేక మంది జాతీయ నాయకులను కలిసి పార్టీ విషయాన్ని చెప్పారు. కానీ ఒక్కరు కూడా ఆయన వెంట నడవడానికి సిద్ధంగా లేదు. కేసీఆర్, బీఆర్ఎస్ వెనుక వచ్చేది ఎంఐఎం పార్టీ, దాని అధినేత అసదుద్దీన్ మాత్రమే అని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపైనే కిషన్ రెడ్డిని బీజేపీ హెచ్చరించింది. పార్టీ ప్రకటన చేయకముందే ఇలాంటి ఆరోపణలు తగదని హితవు పలికింది.