ఉంటే ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి. అసంతృప్తులకు బీజేపీ వార్నింగ్

గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ నేతలు గ్రూపులుగా విడిపోయి.. అసంతృప్తి వ్యక్తం చేయడంతో పార్టీ అధ్యక్ష స్థానం నుంచి బండి సంజయ్‌ను తొలగించి కిషన్‌రెడ్డిని నియమించింది అధిష్టానం.

Advertisement
Update:2023-10-06 08:13 IST

తెలంగాణ బీజేపీలోని అసంతృప్త నేతలకు వార్నింగ్ ఇచ్చింది అధిష్టానం. పార్టీ నిబంధనలకు కట్టుబడి పని చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఇష్టంలేని వారు పార్టీని వదిలేసి వెళ్లిపోవచ్చంటూ మొహం మీదే చెప్పేసింది. ఈ మేరకు గురువారం జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో బీ.ఎల్‌.సంతోష్‌ సీరియస్‌ కామెంట్స్ చేసినట్లు సమాచారం. ఎవరికోసమో పార్టీ విధానాలు మార్చుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే.. పాలమూరు, నిజామాబాద్‌లో బహిరంగ సభలు నిర్వహించిన కమలం పార్టీ.. ఇప్పుడు పార్టీని ఆర్డర్‌లో పెట్టడంపై దృష్టిపెట్టింది.

ఇటీవల కాలంలో పలువురు సీనియర్లు బహిరంగంగానే పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. దీంతో అలాంటి నేతలకు బీజేపీ అధిష్టానం స్ట్రాంగ్‌ మెస్సెజ్‌ పంపింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలతో కొత్త సంస్కృతి పాకిందన్న బీ.ఎల్.సంతోష్‌.. పార్టీ పనితీరులో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. వ్యక్తిగత ఎజెండాతో పనిచేసే వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించినట్లు సమాచారం.

గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ నేతలు గ్రూపులుగా విడిపోయి.. అసంతృప్తి వ్యక్తం చేయడంతో పార్టీ అధ్యక్ష స్థానం నుంచి బండి సంజయ్‌ను తొలగించి కిషన్‌రెడ్డిని నియమించింది అధిష్టానం. అయితే అసమ్మతి తాత్కాలికంగా సద్దుమణిగినట్లు కనిపించినప్పటికీ.. పార్టీ నాయకులు తమ అభిప్రాయాలు బహిరంగంగా వ్యక్తం చేయడం పార్టీకి తలనొప్పిగా మారింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సహా పలువురు నేతలు పార్టీ మారుతామని సంకేతాలు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అసంతృప్త నేతలకు అధిష్టానం హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News