వెడ్డింగ్ కార్డుపై రఘునందన్ ఫొటో.. క్రిమినల్ కేసు నమోదు
మహమ్మద్ నగర్ గేట్ తండాకు చెందిన సురేష్ నాయక్.. తన సోదరుడి వెడ్డింగ్ కార్డుపై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఫొటోను ముద్రించారు.
మెదక్ పార్లమెంట్ పరిధిలో ఓ వివాహ ఆహ్వానం ఎన్నికల వివాదానికి తెర తీసింది. వెడ్డింగ్ కార్డుపై బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఫొటోతో పాటు బీజేపీకి ఓటు వేయాలని పిలుపునివ్వడంతో పోలీసులు క్రిమినల్ కేసు రిటర్న్ గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ ఘటన మెదక్ జిల్లా మహమ్మద్ నగర్ గేట్ తండాలో చోటు చేసుకుంది.
మహమ్మద్ నగర్ గేట్ తండాకు చెందిన సురేష్ నాయక్.. తన సోదరుడి వెడ్డింగ్ కార్డుపై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఫొటోను ముద్రించారు. పెళ్లి కానుకగా రఘునందన్ రావుకు ఓటు వేయాలని బంధువులను కోరారు. అయితే ఈ ప్రచారం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు గుర్తించారు అధికారులు. కౌడిపల్లి, చిలప్‌చెడ్, కుల్చారం మండలాల్లో ఎన్నికల నిర్వహణను పర్యవేక్షిస్తున్న అధికారులు.. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో సురేష్ నాయక్‌పై ఐపీసీ సెక్షన్ 171-C, 171-F కింద కేసు నమోదు చేశారు కౌడిపల్లి పోలీసులు. దీంతో పాటు అధికారుల ఆదేశాలను ధిక్కరించినందుకు సెక్షన్ 188 కింద సురేష్ నాయక్‌పై కేసు నమోదైంది.