హైదరాబాద్ వేదికగా బయో ఏషియా 2024.. థీమ్, డేట్స్ వెల్లడించిన మంత్రి కేటీఆర్
21వ బయో ఏషియా సదస్సు కోసం డాటా అండ్ ఏఐ - రీడిఫైనింగ్ పాసిబిలిటీస్ అనే థీమ్ ఎంపిక చేసినట్లు ఎక్స్‌లో తెలిపారు.
హైదరాబాద్ వేదికగా నిర్వహించనున్న బయో ఏషియా 2024 సదస్సు తేదీలు, థీమ్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ప్రతీ ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు.. 2024లో ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు జరుపనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ సారి బయో ఏషియా కోసం డాటా అండ్ ఏఐ- రీడిఫైనింగ్ పాసిబిలిటీస్ అనే థీమ్‌ను ఎంపిక చేశారు. హైదరాబాద్ వేదికగా ప్రతీ ఏడాది నిర్వహిస్తున్న బయో ఏషియా సదస్సుకు ఏన్నో దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ సారి కూడా ఈ సదస్సుకు మంచి ఆదరణ లభిస్తుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది.
బయో ఏషియా-2024కు సంబంధించిన వివరాలను ఎక్స్ (ట్విట్టర్)లో వెల్లడిస్తూ.. టెక్నాలజీని బయాలజీ, డేటా సైన్స్‌ను లైఫ్ సైన్సెస్ కలిసే ప్రదేశమే హైదరాబాద్ అని పేర్కొన్నారు. 21వ బయో ఏషియా సదస్సు కోసం డాటా అండ్ ఏఐ - రీడిఫైనింగ్ పాసిబిలిటీస్ అనే థీమ్ ఎంపిక చేసినట్లు ఎక్స్‌లో తెలిపారు. డేటా ఆధారిత టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రాబోయే రోజుల్లో హెల్త్ కేర్, ఫార్మాస్యుటికల్స్, బయో టెక్నాలజీలో ఎంత కీలక పాత్ర పోషించబోతున్నాయో ఈ సదస్సులో చర్చించనున్నారు. బయో ఏషియా-2024 లోగోను ఈ సందర్భంగా విడుదల చేశారు.
హెచ్ఐసీసీ వేదికగా ఈ ఏడాది ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు 20వ బయో ఏషియా సదస్సు నిర్వహించారు. ఇందులో మానవీయ ఆరోగ్య పరిరక్షణలో భవిష్యత్ తరానికి మార్గదర్శనం అనే థీమ్‌తో నిర్వహించిన ఈ సదస్సులో 50 దేశాల నుంచి 5,600 మంది ప్రభుత్వ ప్రముఖఉలు, పరిశ్రమల అధిపతులు, పరిశోధకులు, వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సారి కూడా దాదాపు 6వేల మంది ప్రతినిధులు సదస్సుకు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.