అప్పటి వరకు కవితను విచారణకు పిలవొద్దు -సుప్రీం
తదుపరి విచారణను నవంబర్ 20వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు ఎమ్మెల్సీ కవితకు ఎలాంటి నోటీసులు జారీ చేయొద్దంటూ ఈడీని ఆదేశించింది. మహిళలకు కొన్ని రక్షణలు కల్పించాలన్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించింది. ఈడీ సమన్లు జారీ చేయడాన్ని తప్పుపడుతూ కవిత వేసిన పిటిషన్ పై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ ను నవంబర్ 20కి వాయిదా వేస్తూ సుప్రీం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అప్పటి వరకు కవితకు సమన్లు జారీ చేయొద్దంటూ ఈడీని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తూ.. అప్పటి వరకు కవితకు ఎలాంటి నోటీసులు జారీ చేయబోమని తెలిపింది ఈడీ.
మహిళలకు రక్షణ కల్పించాలి..
ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దర్యాప్తు తీరును తప్పుబడుతూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహిళను విచారణకు పిలిచే సమయంలో.. రూల్స్ పాటించలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈడీపై గతంలో దాఖలైన అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరం కేసుతో ట్యాగ్ చేసి విచారణ చేపట్టాలని పిటిషన్లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగా సమన్లు జారీ చేయడం తగదని, గతంలో నళిని చిదంబరంకు ఇచ్చినట్టే తనకు వెసులుబాటు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు కవిత. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం.. తదుపరి విచారణను నవంబర్ 20వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు ఎమ్మెల్సీ కవితకు ఎలాంటి నోటీసులు జారీ చేయొద్దంటూ ఈడీని ఆదేశించింది. మహిళలకు కొన్ని రక్షణలు కల్పించాలన్సిన అవసరం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.
అక్టోబర్ 18న ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ ప్రత్యేక ధర్మాసనం ముందుకు వస్తుంది. ఆ తర్వాత కూడా కవితకు నవంబర్ 20 వరకు ఊరట లభించినట్టే లెక్క. అప్పటి వరకు ఆమెకు సమన్లు జారీ చేయొద్దని ఈడీకి ఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు. నవంబర్-20 వరకు ప్రస్తుతం అమలులో ఉన్న మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని పేర్కొంది.