మన్మోహన్ సింగ్‌కు భారత రత్న ఇవ్వాలి : సీఎం రేవంత్
తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశంలో మన్మోహన్ మృతి నేపథ్యంలో సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టారు.
దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీలో సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఆయన చేసిన సేవలను సీఎం గుర్తు చేశారు. ఆర్థిక వేత్తగా, కేంద్రమంత్రిగా, ప్రధానిగా కీలక పదవుల్లో కొనసాగారని తెలిపారు. మన్మోహన్ సింగ్ హయంలోనే తెలంగాణ ఏర్పడిందని సీఎం పేర్కొన్నారు. ఆయన సేవలను గుర్తిస్తూ భారత రత్న ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.. 1991-96 మధ్య దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయన ఊపిరిలూదారని సీఎం వివరించారు.
పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును మన్మోహన్ పాస్ చేయించారని, ఇందుకు తెలంగాణ ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారని సీఎం చెప్పుకొచ్చారు. తెలంగాణకు రాష్ట్ర హోదా కల్పించిన మానవతావాది, రాష్ట్రానికి ఆత్మబంధువు మన్మోహన్ సింగ్ అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణలో మన్మోహన్‌ను విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అసెంబ్లీ వేదికగా సీఎం ప్రకటన చేశారు. మాజీ ప్రధాని విగ్రహం తెలంగాణ ప్రజల్లో స్ఫూర్తి నింపుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు