తెలంగాణలో ముందుగానే అడుపెట్టనున్న రాహుల్ 'భారత్ జోడో యాత్ర'

భారత్ జోడో యాత్ర కర్ణాటక లెగ్ పూర్తయిన తర్వాత తెలంగాణలోకి ఎంటర్ కానున్నది. గత షెడ్యూల్ కంటే ఒక రోజు ముందుగానే యాత్ర తెలంగాణలోకి ప్రవేశించనున్నది.

Advertisement
Update:2022-10-09 10:24 IST

కాంగ్రెస్ మాజీ చీఫ్, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' కేరళలో పూర్తి చేసకొని కర్ణాటకలో కొనసాగుతోంది. ఈ నెల చివరి వారంలో ఈ యాత్ర తెలంగాణలోకి అడుగుపెట్టనున్నది. అయితే షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తున్నది. రాహుల్ యాత్ర తెలంగాణలోకి ఒక రోజు ముందుగానే అడుగుపెట్టనున్నట్లు సమాచారం. తెలంగాణ యాత్రకు సంబంధించిన సమీక్షను గాంధీభవన్‌లో నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాహుల్ పర్సనల్ సెక్రటరీ బైజు, యాత్ర పర్యవేక్షకులు సుశాంత్ మిశ్రా హాజరయ్యారు.

షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24న మక్తల్ దగ్గర రాహుల్ పాదయాత్ర తెలంగాణలోకి ప్రవేశించాలి. అయితే మార్చిన షెడ్యూల్ ప్రకారం 23వ తేదీనే మక్తల్ సమీపంలోని కృష్ణా బ్రిడ్జి వద్ద రాహుల్ పాదయాత్ర తెలంగాణలోకి ఎంటర్ కానున్నది. అనంతరం రెండు రోజుల పాటు యాత్రకు విశ్రాంతి ఇవ్వనున్నారు. దీపావళి సందర్బంగా యాత్ర రెండు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఇటీవల దసరా సందర్భంగా కూడా రెండు రోజుల పాటు యాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఈ నెల 23న తెలంగాణలోకి రాహుల్ యాత్ర ఎంటర్ అయినా.. ఆ తర్వాత 26 నుంచి మాత్రమే కొనసాగనున్నది. ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.

ఇక శంషాబాద్ వద్ద ఏర్పాటు చేయాలనుకున్న భారీ బహిరంగ సభ కోసం ఇంకా కసరత్తు జరుగుతున్నది. ఏఐసీసీ నుంచి ఇంకా ఆమోదం తెలపకపోయినా.. రాష్ట్ర కాంగ్రెస్ మాత్రం ఏర్పాట్లు చేస్తున్నది. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో బహిరంగ సభ ప్రాముఖ్యతను టీపీసీసీ వివరించింది. అయితే, భారత్ జోడో యాత్ర లక్ష్యం ఎన్నికలు కాదని.. దాని థీమ్ వేరే అని.. యాత్రలో ఇలా ఎన్నికల సభలు పెట్టడం మంచిది కాదని ఆలోచిస్తున్నది. అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్ మాత్రం సభ నిర్వహణకు పట్టుదలగా ఉన్నారు. ఎలాగైనా రాహుల్ సభను వాడుకొని మునుగోడు ఉపఎన్నికలో విజయం సాధించాలని భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News