పోలవరం వల్లే భద్రాచలం మునిగిపోతోంది.. నిపుణుల కమిటీ రిపోర్ట్

పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిని పూర్తి స్థాయిలో నిల్వ చేసినప్పుడు (ఫుల్ రిజర్వాయర్ లెవెల్) భద్రాచలం వద్ద 43 అడుగుల మేర బ్యాక్ వాటర్ ఉంటుందని నివేదికలో పేర్కొన్నారు.

Advertisement
Update:2023-02-23 07:40 IST

ఏపీలో గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్లే టెంపుల్ టౌన్ భద్రాచలం ముంపునకు గురవుతోందని స్పష్టమైంది. ఇటీవల వరదల కారణంగా భద్రాచలం ముంపునకు గురి కావడంతో.. తెలంగాణ సాగు నీటి పారుదల శాఖ.. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఈఎన్సీ నాగేందర్ రావు నేతృత్వంలో ప్రభుత్వం ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. గోదావరి వరదలపై వెంటనే నివేదిక అందించాలని ఈ కమిటీనీ ప్రభుత్వం ఆదేశించింది. గతంలోనే మధ్యంతర నివేదిక సమర్పించిన ఈ కమిటీ.. తాజాగా పూర్తి స్థాయి నివేదిక ఇచ్చింది. ఇందులో అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.

పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిని పూర్తి స్థాయిలో నిల్వ చేసినప్పుడు (ఫుల్ రిజర్వాయర్ లెవెల్) భద్రాచలం వద్ద 43 అడుగుల మేర బ్యాక్ వాటర్ ఉంటుందని నివేదికలో పేర్కొన్నారు. భవిష్యత్‌లో దీని వల్ల ముంపు ప్రమాదం మరింత పెరుగుతుందని తెలిపింది. ఇందుకు తీసుకోవల్సిన చర్యలను కూడా నివేదికలో వెల్లడించారు. భద్రాచలం ముంపు నివారణకు సుమారు రూ.1,629 కోట్లు అవసరం అవుతాయని నిపుణుల కమిటీ అంచనా వేసింది. భద్రాచలం సమీపంలో గోదావరి నదికి ఇరు వైపులా తప్పకుండా కరకట్టలు నిర్మించాలని తెలిపింది.

గోదావరి నదికి కుడి వైపున బూర్గంపాడు మండలం సంజీవరెడ్డిపాలెం నుంచి అశ్వాపురం మండలం అమ్మగారి పల్లి వరకు.. ఎడమ వైపు భద్రాచలం మండలం సుభాశ్‌నగర్ కాలనీ నుంచి దుమ్మగూడెం మండలం సున్నంబట్టి గ్రామం వరకు ఇరువైపులా 16 కిలోమీటర్ల పొడవునా కరకట్టలు నిర్మించాలని సూచించింది. ప్రస్తుతం ఉన్న కరకట్టలను మరింత పటిష్టం చేయడంతో పాటు డ్రైనేజీ నిర్మాణాలను కూడా చేపట్టాలని తెలిపింది. 15 మైనర్, 2 మీడియం, 6 మేజర్ క్రాస్ డ్రైనేజీల నిర్మాణలు పూర్తయితే పట్టణంతో పాటు చుట్టు పక్కల గ్రామాలు ముంపు నుంచి రక్షించబడతాయని నిపుణుల నివేదికలో వెల్లడించారు.

ఇక పోలవరం ముంపు ప్రాంతాలపై సంయుక్త సర్వే చేపట్టేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్ర జల్‌శక్తి శాఖ ఆదేశించింది. పోలవరం నిర్మాణంపై ఏకాభిప్రాయం సాధించాలనే సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి ఒడిశా, చత్తీస్‌గడ్, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అధికారులతో జనవరి 25న ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే తెలంగాణ పలు అంశాలను ప్రతిపాదించగా సీడబ్ల్యూసీ అంగీకరించింది. జాయింట్ సర్వేకు తెలంగాణ సిద్ధంగా ఉందని కూడా తెలియజేసింది. దీంతో వెంటనే సర్వే కోసం తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి కేంద్ర జల్‌శక్తి శాఖ మెంబర్ సెక్రటరీ రఘురామ్ బుధవారం లేఖ రాశారు.

Tags:    
Advertisement

Similar News