భక్తులతో కిటకిటలాడుతున్న భద్రాచలం
కార్తీకమాసం మొదటి రోజు రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులు
కార్తీకమాసం మొదటి రోజు సందర్భంగా భద్రాచలం పవిత్ర గోదావరిలో భక్తులు తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు చేస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరిస్తూ గోదావరి నదిలో కార్తీక దీపాలు వదులుతున్నారు. అనంతరం నది ఒడ్డున గల శ్రీసుబ్రహ్మణ్యేశ్వర ఆలయం వద్ద దీపాలు వెలిగిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులు అధిక సంఖ్యలో గోదావరి నది వద్దకు తరలిరావడంతో సందడి నెలకొన్నది. కార్తీకమాసంలో పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి దీపాలు వెలిగించడం వల్ల శ్రేయస్సు కలుగుతుందని అర్చకులు చెబుతున్నారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే క్రమంలో నది లోతు తెలియక లోపలికి వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారని, అధికారులు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని అర్చకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు ప్రమాదానికి గురయ్యారని, ఇవాళ కూడా ఒక మహిళ నీళ్లలో మునిగిపోతున్న సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పిందన్నారు. కాబట్టి పిల్లలు, మహిళలు, వృద్ధులను దృష్టిలో పెట్టుకుని పంచాయతీ వారు తగిన రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలని ఆలయ అర్చకులు కోరారు.