4రోజులు ఎండలు మండిపోతాయి జాగ్రత్త.. వాతావరణ శాఖ హెచ్చరిక
6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. శుక్రవారంతో మొదలై ఏప్రిల్ 3వతేదీ వరకు ఈ అలర్ట్ అమలులో ఉంటుందని అన్నారు. ఆరెంజ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41నుంచి 45 డిగ్రీల మధ్య నమోదవుతాయని అంచనా.
ఏడాదికేడాది వేసవి గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నా.. ఈ ఏడాది మాత్రం ఎల్ నినో ప్రభావంతో గరిష్టాలు సరికొత్త రికార్డులు తాకే అవకాశముంది. మార్చి ముగిసేలోపే ఉష్ణోగ్రతల్లో భారీ మార్పు కనపడుతోంది. ఈ నేపథ్యంలో 4రోజులపాటు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది వాతావరణ శాఖ. తెలంగాణలో 4రోజులపాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది. ఇంటి నుంచి బయటకు వెళ్లే పనులు పెట్టుకోకపోవడం మేలని సూచిస్తోంది.
మార్చి 31తో మొదలు కొని.. ఏప్రిల్ 1, 2, 3 తేదీల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలియజేసింది. కొన్ని జిల్లాల్లో సాధారణం కన్నా రెండు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంచనా వేసింది. గురువారం కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలో తెలంగాణలోనే గరిష్టంగా 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజన్న-సిరిసిల్ల, నిజామాబాద్, సిద్దిపేట, నల్గొండ సహా మొత్తం 15 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైనే నమోదయ్యాయి. దీంతో వాతావరణ శాఖ అప్రమత్తత ప్రకటించింది.
6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. శుక్రవారంతో మొదలై ఏప్రిల్ 3వతేదీ వరకు ఈ అలర్ట్ అమలులో ఉంటుందని అన్నారు. ఆరెంజ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41నుంచి 45 డిగ్రీల మధ్య నమోదవుతాయని అంచనా. మిగిలిన జిల్లాల్లో ఎల్లో అలర్ట్ అమలులో ఉంటుందని తెలిపారు అధికారులు. ఎల్లో అలర్ట్ ఉంటే ఆయా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 36నుంచి 40 డిగ్రీల మధ్య నమోదవుతాయి. ప్రస్తుతానికి రెడ్ అలర్ట్ (45 డిగ్రీల పైన) ఏ జిల్లాకు జారీ చేయలేదు. ఈ 4 రోజులు ఆరుబయట పని చేసే వారు, ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది వాతావరణ శాఖ.