సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండండి.. బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ పిలుపు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనల మేరకు పార్టీ సందేశాన్ని నాయకులు, కార్యకర్తలకు చేరవేస్తున్నారు.
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇప్పటికీ ఎవరికైనా సోషల్ మీడియాలో అకౌంట్లు లేకపోతే వెంటనే ఓపెన్ చేయాలని ఆయన సూచించారు. ప్రజలకు చేరువయ్యేందుకు అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి పార్టీ క్యాడర్ మధ్య ఐక్యత పెంచడమే కాకుండా.. వారిలో ఉత్సాహం నింపుతున్నారు. ప్రస్తుతం ఎన్నికల ఏడాది కావడంతో ప్రజలకు మరింతగా చేరువయ్యేందుకు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండాలని ఆయన సూచిస్తున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనల మేరకు పార్టీ సందేశాన్ని నాయకులు, కార్యకర్తలకు చేరవేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను నిత్యం సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని పార్టీ ప్రతినిధులకు చెబుతున్నారు. అంతే కాకుండా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అనవసర ఆరోపణలను ఖండించడానికి, వారి ప్రచారం అబద్దం అని చెప్పడానికి కూడా సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలని నాయకులకు చెబుతున్నారు.
ఇప్పటికే గ్రేట్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, మహ్మద్ అలీతో పాటు ఇతర ఎమ్మెల్యేలు, నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సిటీలో ఉన్న ప్రతీ కార్యకర్త సోషల్ మీడియాలో అకౌంట్ కలిగి ఉండాలని చెబుతున్నారు. నిత్యం ప్రజల్లో ఉండటానికి రోజూ వారిని కలవడమే కాకుండా.. సోషల్ మీడియాను కూడా ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ నాయకులకు సూచించారు. పార్టీ పరంగా కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని తలసాని చెప్పారు. మహారాష్ట్రలో జరుగనున్న బహిరంగ సభకు కూడా హైదరాబాద్ నుంచి కార్యకర్తలు హాజరయ్యేలా చూడాలని అన్నారు.