బీసీలు ఎప్పటికీ సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉండాలి : మంత్రి గంగుల కమలాకర్

ఈ ఏడాది మరో 17 కాలేజీలు మొదలు పెట్టుకుంటున్నాము. ఇందుకు అవసరమైన పరిపాలనా అనుమతులు త్వరలోనే విడుదల కానున్నట్లు మంత్రి కమలాకర్ స్పష్టం చేశారు.

Advertisement
Update:2023-06-13 22:26 IST

వెనుకబడిన కులాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంటున్నది. ఈ క్రమంలోనే జిల్లాకు ఒక గురుకుల డిగ్రీ కాలేజీ ఉండాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పటికే ఉన్న డిగ్రీ కాలేజీలకు అదనంగా మరో 17 కళాశాలలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాష్ట్రంలో గతేడాది 15 కొత్త డిగ్రీ కాలేజీలను ప్రారంభించుకున్నాము. ఈ ఏడాది మరో 17 కాలేజీలు మొదలు పెట్టుకుంటున్నాము. ఇందుకు అవసరమైన పరిపాలనా అనుమతులు త్వరలోనే విడుదల కానున్నట్లు మంత్రి కమలాకర్ స్పష్టం చేశారు.

2022-23లో వర్గల్ కాలేజీతో పాటు 15 కాలేజీలు ప్రారంభించుకున్నాము. ఇందులో రెండు వ్యవసాయ డిగ్రీ కాలేజీలు కూడా ఉన్నాయి. జిల్లాకొక డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయడంతో పాటు బీసీలకు నాణ్యమైన విద్యను అందించాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. తాజాగా 17 డిగ్రీ కాలేజీలనే కాకుండా.. నూతనంగా ఏర్పాటైన జిల్లాల్లో 33 కొత్త గురుకులాల్ని కూడా ప్రారంభించామని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.

స్వరాష్ట్ర సాధన అనంతరం సీఎం కేసీఆర్ సారథ్యంలో గతంలో వెనుకవేయబడిన బీసీలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తున్నారు. అప్పట్లో కేవలం 19 గురుకులాలు.. 7,000 మంది విద్యార్థులకు మాత్రమే గురుకుల విద్య అందుతుండేది. కానీ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం సకల హంగులతో, ప్రపంచస్థాయి నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను దశల వారీగా అదిస్తోందని గంగుల కమలాకర్ చెప్పారు.

ఒకప్పుడు 261 ఉన్న గురుకులాలు ఇప్పుడు 310కి చేరుకున్నాయి. గురుకులాల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న బీసీ బిడ్డలు అన్ని పోటీ పరీక్షల్లో సత్తా చాటుతూ.. తెలంగాణ రాష్ట్ర కీర్తిని దశదిశలా చాటుతున్నారని అన్నారు. ఇప్పటి వరకు బీసీ గురుకులాల్లో 1,68,000 మందికి పైగా చదువుకున్నారని.. వారందరూ తెలంగాణ కీర్తిని ఇనుమడింప చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు.

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న శుభసమయంలో సీఎం కేసీఆర్ అనేక వరాల జల్లులను బీసీ వర్గాలపై కురిపించారని చెప్పారు. వెనుకబడిన వర్గాల కోసం రూ.వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని అన్నారు. 250 యూనిట్ల విద్యుత్ వినియోగాన్ని రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఉచితంగా కేసీఆర్ అందిస్తున్నారని చెప్పారు. బీసీ చేతి, కుల వృత్తుల కుటుంబాలకు రూ.1 లక్ష సాయం ఇప్పటికే దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అందిస్తున్నారని.. ఇందుకు సీఎం కేసీఆర్‌కు ప్రతీ బీసీ రుణపడి ఉండటమే కాకుండా.. ధన్యవాదాలు చెప్పాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

Tags:    
Advertisement

Similar News