ఆత్మహత్య కాదు.. యూట్యూబ్ చూస్తూ పడిపోయింది.. - ట్రిపుల్ ఐటీ వీసీ
ఒత్తిడి భరించలేక లిఖిత ఆత్మహత్య చేసుకుందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలను వీసీ వెంకటరమణ తీవ్రంగా ఖండించారు.
బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. పీయూసీ మొదటి ఏడాది చదువుతున్న లిఖిత హాస్టల్ భవనం నాలుగో అంతస్తు నుంచి కిందపడి చనిపోయింది. రాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. లిఖిత పైనుంచి పడిపోవడం గమనించిన సిబ్బంది వెంటనే ఆమెను క్యాంపస్‌లోని హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి బైంసా ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే లిఖిత చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు.
లిఖిత ఎలా చనిపోయిందన్న దానిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఒత్తిడి భరించలేక లిఖిత ఆత్మహత్య చేసుకుందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలను వీసీ వెంకటరమణ తీవ్రంగా ఖండించారు. లిఖితది ఆత్మహత్య కాదని.. ప్రమాదవశాత్తు ఆమె పడిపోయారని చెబుతున్నారు. యూట్యూబ్ చూస్తూ అటు ఇటు తిరుగుతున్న లిఖిత.. అదుపు తప్పి కిందపడిపోయిందని చెబుతున్నారు. లిఖితది ఆత్మహత్య అంటూ జరుగుతున్న ప్రచారాన్ని వీసీ ఖండించారు.
సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన లిఖిత వారం రోజుల క్రితమే హాస్టల్‌కు వచ్చింది. ఆమె తండ్రి గజ్వేల్‌లో మిర్చిబండి నిర్వహిస్తుంటారు. రెండు రోజుల క్రితం ట్రిపుల్ ఐటీలోనే దీపిక అనే మరో విద్యార్థిని బాత్‌రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీపిక కూడా పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినే. అసలు లిఖిత రాత్రి 2గంటల సమయంలో బయట ఎందుకు తిరుగుతోంది?.. అమ్మాయిలు అలా 2 గంటల సమయంలో గది నుంచి బయటకు వచ్చి భవనం మీద తిరుగుతుంటే సిబ్బంది ఏం చేస్తున్నారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.