గోవాకు ఇచ్చారుగా.. తెలంగాణకు కూడా ఇస్తారా..?
గోవా లిబరేషన్ డే రోజున 300 కోట్ల రూపాయలు ఆ రాష్ట్రానికి కేటాయించారని, మరి తెలంగాణ సంగతేంటని నిలదీస్తున్నారు. తెలంగాణకు కూడా నిధులు ప్రకటిస్తారా అంటూ అమిత్ షా ని ప్రశ్నిస్తూ బ్యానర్లు కట్టారు.
నిజాం పాలన నుంచి భారత పాలనలోకి తెలంగాణ వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ సెప్టెంబర్-17న జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహణకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే ఆ రోజుని విమోచన దినోత్సవంగా నిర్వహించాలంటూ బీజేపీ హడావిడి చేయాలనుకుంటోంది. కేంద్ర మంత్రి అమిత్ షా తో హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అమిత్ షా పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నవేళ పరేడ్ గ్రౌండ్స్ ప్రహరీ గోడలకు కట్టిన బ్యానర్లు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. బ్యానర్లతో కొంతమంది బీజేపీకి సూటి ప్రశ్నలు సంధిస్తున్నారు. విలీనం, విమోచం, విముక్తి... అంటూ కుస్తీ పడుతున్న బీజేపీ నేతలు సమాధానం చెప్పి తీరాలంటున్నారు.
తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించబోతున్న బీజేపీ.. ప్రత్యేకంగా తెలంగాణకు ఏం చేస్తుందో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు తెలంగాణవాదులు. భారత స్వాతంత్రం తర్వాతే గోవా కూడా దేశంలో అంతర్భాగమైంది. గోవా లిబరేషన్ డే రోజున 300 కోట్ల రూపాయలు ఆ రాష్ట్రానికి కేటాయించారని, మరి తెలంగాణ సంగతేంటని నిలదీస్తున్నారు. తెలంగాణకు కూడా నిధులు ప్రకటిస్తారా అని అడుగుతున్నారు.
ఆ ఒక్కటీ అడక్కండి..
గోవాకు నిధులిచ్చిన కేంద్రం.. తెలంగాణ విషయానికొచ్చేసరికి నిధులివ్వడానికి వెనకాడుతోంది. ఈ వివక్ష ఎందుకంటూ ప్రశ్నిస్తోంది తెలంగాణ పౌర సమాజం. కనీసం ఈ సారయినా హైదరాబాద్ లో అమిత్ షా ఆ ప్రకటన చేస్తారా అంటూ బ్యానర్లు వెలిశాయి. యథావిధిగా ఇదంతా రాజకీయ కుట్ర అని కొట్టిపారేస్తున్నారు బీజేపీ నేతలు. తెలంగాణకు ఇచ్చే నిధుల విషయంలో మాత్రం సమాధానం లేదు.