బండి సంజయ్ కి చెప్పుల అభిమానులు

బండి సంజయ్ పాద యాత్రలో ఆయన బూట్లను ఎవరో కొట్టేస్తున్నారట. అయితే అవి తన జ్ఞాపక చిహ్నంగా తన ఫ్యాన్స్ తీసుకెళ్తున్నారని సంజయ్ ప్రచారం మొదలు పెట్టారు.

Advertisement
Update:2022-08-09 15:16 IST

మంచినైనా, చెడునైనా. శుభాన్నైనా, అశుభాన్నైనా రాజకీయాలకు ఉపయోగించుకోవడం రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. ఈ మధ్య ఈ విద్య నేర్పడానికి రాజకీయ వ్యూహకర్తలు కూడా బయలు దేరారు. అయితే ఇప్పుడు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యూహకర్తలకే వ్యూహాలు నేర్పిస్తున్నారు. వ్యూహకర్తలు కాదు కదా వాళ్ళ తాతలను కూడా మించి పోయింది ఆయన‌ టీం. చెప్పుల దొంగతనాలు జరుగుతుంటే చూశారా మా బండన్న గొప్పతనం అంటూ ప్రచారాలు చేసుకుంటున్నారు.

ఈ మధ్య బండిసంజయ్ అధికారమే లక్ష్యంగా పాదయాత్ర మొదలు పెట్టారు. ఊరూర తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఇతర మతస్తుల మీద మాటల దండయాత్ర చేస్తూ మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇస్తూ సాగిపోతున్నారు. సరే, ఆయనేదో ఆయన రాజకీయ లబ్ది కోసం తన పాట్లేవో తను పడుతున్నాదు. అయితే సందెట్లో సడే మియా లాగా ఇదే సందని బండి సంజయ్ బూట్లు ఎక్కడ విడిచినా కాచుకొని కూర్చున్న దొంగలు ఎత్తుకెళ్తున్నారట. ఎవరింటి ముందైనా బూట్లు విడిచి ఇంట్లోకి పోయెచ్చే లోపు బూట్లు మాయమవుతున్నాయట. ఆయనొక్కడివే కావు కొత్తగా ఎవరి బూట్లు, చెప్పులు కనిపించినా మాయం చేయడం చెప్పుల దొంగల పని. అందుకే బండి సంజయ్ అనుచరులు ఆయనతో పాటు ఓ నాలుగైదు బూట్ల జతలు కూడా తీసుకెళ్తున్నారట.

ఇక్కడి వరకు బాగానే ఉంది. సంజయ్ పని సంజయ్, దొంగల పని దొంగలు చేశారు. ఇక ఇక్కడే అసలు ప్రచారం మొదలయ్యింది. బూట్లు ఎత్తుకెళ్తున్నది దొంగలు కాదు. బండన్న వీరాభిమానులు, అన్న కు గుర్తుగా బూట్లు ఎత్తుకెళ్ళి దాచుకుంటున్నారు అని సంజయ్ సోషల్ మీడియా టీం ప్రచారం అందుకు‍ంది. అక్కడితో ఆగలేదు. ఇదే విషయాన్ని స్వయంగా బండి సంజయే ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చేశారు.

"ఇది ప్రతిరోజూ జరగదు కానీ పాదరక్షలను ఏదైనా ఇంటి వెలుపల లేదా మరేదైనా ప్రదేశం వెలుపల వదిలివేసిన సందర్భాల్లో అవి పోతున్నాయి. అది దొంగతనం కాదు. ఆ బూట్లు నా అభిమానులకు జ్ఞాపక చిహ్నాలుగా మారాయి. ఇవి 'సంజయ్ అన్న బూట్లు' అంటూ వాటిని తీసుకెళ్తున్నారు'' అని ఆ పత్రిక‌తో బండి సంజయ్ చెప్పారు.

"ముఖ్యంగా ఇటువంటి సంఘటనలు రెండవ దశ పాదయాత్ర‌లో జరిగాయి. అందుకే మేము స్పేర్ బూట్ల నుకూడా తీసుకెళ్తున్నాం'' అని సంజయ్ అనుచరుడు ఒకరు చెప్పారు.

ఇలా దొంగతనాలను కూడా తమ బిల్డప్ కోసం ఉపయోగించుకున్న వాళ్ళను ఎప్పుడైనా, ఎక్కడైనా చూశారా ?

మీరు కూడా ఎప్పుడైనా మీ చెప్పులు దొంగతనం జరిగితే బాధపడకండి మీకు కూడా వీరాభిమానులు పెరిగారని సంబరపడండి.

Tags:    
Advertisement

Similar News