'భాగ్యనగర్ ఉత్సవ సమితి నాయకుల అరెస్టుపై బండి సంజయ్ అబద్దపు ప్రచారం'

గణేష్ ఉత్సవ సమితి నాయకుల అరెస్టుపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం ఐటీ శాఖ అద్వర్యంలో నడిచే ''ఫ్యాక్ట్ చెక్'' ట్విట్టర్ హ్యాండిల్ స్పష్టం చేసింది.

Advertisement
Update:2022-09-06 17:39 IST

వినాయక నిమజ్జనంపై రాజకీయ రచ్చ చేయడానికి బీజేపీ ఎత్తుగడలు వేస్తున్నదని టీఆరెస్ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో భాగ్యనగర్ ఉత్సవ సమితి నాయకుల అరెస్టులకు సంబంధించి ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాడని ప్రభుత్వానికి చెందిన 'ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ' ట్విట్టర్ హ్యాండిల్ పేర్కొంది.

ఈ అంశంపై ముందుగా బండి సంజయ్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ లో ''భాగ్యనగర్ ఉత్సవ సమితి నాయకుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాను.హిందువుల పండుగలను ప్రశాంతంగా జరగనియ్యరా ?

గణేష్ నిమజ్జన ఉత్సవాలను ప్రశాంతంగా జరపాలని అడిగితే అరెస్ట్ చేస్తారా ?'' అని ప్రశ్నించారు. దీనిపై పోలీసు అధికారులతో సంప్రధించి ఫ్యాక్ట్ చెక్ చేసిన ట్విట్టర్ హ్యాండిల్ బ‍ండి సంజయ్ ఆరోపణలు అబద్దమని తేల్చింది.

''బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు శ్రీ బండి సంజయ్ హైదరాబాద్ భాగ్యనగర్ ఉత్సవ సమితి (BGUS) నాయకుల అరెస్టు విషయమై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరపాలని అడిగితే BGUS నాయకులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారని ఆయన అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు '' అని ట్విట్టర్ హ్యాండిల్ పేర్కొంది.

అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు అసెంబ్లీకి 4 కిలో మీటర్ల దూరంలో ర్యాలీలకు, సభలు, సమావేశాలకు అనుమతి ఉండదని తెలిపిన 'ఫ్యాక్ట్ చెక్ ' ఆ నాలుగు కిలో మీటర్ల లోపు అనుమతి లేకుండా ర్యాలీ తీసినందుకు పోలీసులు పలువురిని అరెస్టు చేసినట్టు తెలిపింది.

మరో వైపు ప్రభుత్వం గణేష్ నిమజ్జనం జరగనివ్వడం లేదన్న బీజేపీ నాయకుల మాటలు కూడా అబద్దమని అధికారులు తెలిపారు. నిమజ్జనం కోసం అన్ని ముందస్తు ఏర్పాట్లు జరిగాయని, జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 31 చెరువులతో పాటు, 74 ఇతర కొలనులను నిమజ్జనం కోసం సిద్ధం చేశామని అధికారులు స్పష్టం చేశారు. నిమజ్జనం కోసం 280 క్రేన్లు, 130 మొబైల్‌ క్రేన్లు, 10 వేలమంది శానిటేషన్‌ సిబ్బందిని నియమించారు.

సెప్టెంబర్ 9న జరిగే గణేష్ నిమజ్జనం కోసం నగరంలోని అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలియచేశారు.


కాగా హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనం పై జూలై 21, 2022న తెలంగాణ హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయడాన్ని హైకోర్టు నిషేధించింది. ఒక్క మట్టి విగ్రహాలను మాత్రమే హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయాలని కోర్టు పేర్కొంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను హైదరాబాద్ లోని 31 చెరువులు, 74 కొలనుల్లో నిమజ్జనం చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అందుకోసం జీహెచ్‌ఎంసీ అన్ని ఏర్పాట్లు చేసింది.

Tags:    
Advertisement

Similar News