నేడు మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్న బండి సంజయ్
ఎమ్మెల్సీ కవితపై చేసిన కామెంట్లపై వ్యక్తిగతంగా హాజరయ్యి వివరణ ఇవ్వాలని మహిళా కమిషన్ నోటీసులో పేర్కొన్నది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇవాళ తెలంగాణ మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 11.00 గంటలకు ఆయన మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు జారీ అయ్యాయి. కాగా, బీజేపీ లీగల్ సెల్, మహిళా న్యాయవాదులతో కలసి విచారణకు వెళ్లనున్నట్లు తెలుస్తున్నది.
ఎమ్మెల్సీ కవితపై చేసిన కామెంట్లపై వ్యక్తిగతంగా హాజరయ్యి వివరణ ఇవ్వాలని మహిళా కమిషన్ నోటీసులో పేర్కొన్నది. కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలను మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకోవడం వల్లే నోటీసులు జారీ చేసింది. మార్చి 15నే విచారణకు రావాలని ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. అయితే పార్లమెంట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో తాను మార్చి 15న హాజరుకాలేనని మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కు లేఖ రాశారు. విచారణను మార్చి 18కి వాయిదా వేయాలని బండి సంజయ్ కోరారు.
బండి సంజయ్ కోరడంతో సానుకూలంగా స్పందించిన మహిళా కమిషన్ విచారణను నేటికి వాయిదా వేసింది. మార్చి 18న ఉదయం 11.00 గంటలకు హాజరవ్వాలని తాజాగా సూచించింది. ఈ నేపథ్యంలోనే నేడు బండి సంజయ్ మహిళా కమిషన్ ముందుకు వెళ్లనున్నారు. కాగా, మహిళా కమిషన్ ముందు బండి ఏం సమాధానం ఇవ్వనున్నారో అనే విషయంపై ఉత్కంఠ నెలకొన్నది. ఇప్పటికే కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడుతోంది. వెంటనే సంజయ్ క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేసింది.
ఢిల్లీలోని తెలంగాణ భవన్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. బండి సంజయ్, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు.. పలు చోట్ల సంజయ్ దిష్టిబొమ్మలను దగ్దం చేశారు. ఇవాళ ఆయన మహిళా కమిషన్ ముందుకు వస్తుండటంతో అక్కడ పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.