శవయాత్రల్లో భగవద్గీత వినపడితే దాడులే... హిందువులకు బండి సంజయ్ హెచ్చరిక

మనిషి చనిపోయినప్పుడు భగవద్గీత వినిపిస్తే దాడులు చేస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ హిందువులను హెచ్చరించారు. ఇకపై ఏ స్వర్గపురి వాహనం, శవయాత్రలో అయినా భగవద్గీత వినిపిస్తే తప్పకుండా దాడులు చేస్తామని హెచ్చరించారు. సదరు వాహనాల టైర్లు కోసి పడేస్తామని, అవసరం అయితే శ్మశాన వాటికకు వచ్చి అలా మైకులో పెట్టిన వాడిపై దాడి చేస్తామని సంజయ్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు.

Advertisement
Update:2022-08-18 20:57 IST

భగవద్గీతను శవయాత్రల్లో వినిపించడంపై బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతిమయాత్రల్లో, స్వర్గపురి వాహనాల్లో, శ్మశానవాటికల్లో భగవద్గీతను మైకుల్లో పెట్టి వినిపించడంపై ఆయన మండి పడ్డారు. ఎవరో ఒక తెలివి తక్కువ వాడు.. మనిషి చనిపోయినప్పుడు భగవద్గీత వినిపిస్తే.. దాన్నో ఆనవాయితీగా తీసుకొని ఇప్పుడు హిందువులందరూ భగవద్గీతను వాడుతున్నారని అన్నారు. ఇకపై ఏ స్వర్గపురి వాహనం, శవయాత్రలో అయినా భగవద్గీత వినిపిస్తే తప్పకుండా దాడులు చేస్తామని హెచ్చరించారు. సదరు వాహనాల టైర్లు కోసి పడేస్తామని, అవసరం అయితే శ్మశాన వాటికకు వచ్చి అలా మైకులో పెట్టిన వాడిపై దాడి చేస్తామని సంజయ్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు.

ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా జనగామ జిల్లా కుందారం గ్రామానికి చేరుకున్న బండి సంజయ్ అక్కడ బ్రాహ్మణ, అర్చక కమిటీ సభ్యులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సంజయ్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. భగవద్గీతను కేవలం చనిపోయినప్పుడు మాత్రమే పెడుతూ.. దాన్నొక సంప్రదాయంగా మార్చేశారని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన చిన్నప్పుడు సరస్వతి మందిరాల్లోకి వెళితే ఉదయాన్నే భగవద్గీత వినిపించే వాళ్లు. అప్పుడు మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించేదని ఆయన అన్నారు. కానీ ఎవడో ఒక మూర్ఖుడు, ఫాల్తుగాడు చనిపోయినప్పుడు భగవద్గీత పెట్టడం మొదలు పెట్టాడు. ఇవ్వాళ అదే ఆనవాయితీగా మారిపోయిందని అన్నారు.

చనిపోయినప్పుడు స్వర్గపురి వాహనాల్లో భగవద్గీత పెడితే టైర్లు కోసేస్తామని హెచ్చరించిన తర్వాత కరీంనగర్‌లో ఎవరూ వాడటం లేదని ఆయన గుర్తు చేశారు. రామాయణ, మహాభారతాలను కూడా కామెడీ చేస్తున్నారని ఆయన చెప్పారు. గుడికి వచ్చే భక్తులకు భగవద్గీత గురించి వివరించాల్సిన బాధ్యత పూజారులపైనే ఉందన్నారు. ఎక్కడైనా భగవద్గీత వినిపిస్తే టెన్షన్ మొదలవుతోంది. ఎవరైనా చచ్చిపోయారేమో అనే అనుమానం కలుగుతోందన్నారు. అందుకే భగవద్గీతను ఇలా శవయాత్రల్లో పెట్టొద్దని అన్నారు.

పూజారులు చెప్తే ప్రజలు అర్థం చేసుకుంటారని.. మేము చెప్తే అది రాజకీయం అవుతుందని బండి సంజయ్ అన్నారు. సనాతన హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికే ఇలా శవయాత్ర వాహనాలకు భగవద్గీతను పరిమితం చేశారని సంజయ్ ఆరోపించారు. ఇకపై ఇలా హిందూ మత సంస్కృతి, సాంప్రదాయాలను వక్రీకరిస్తే చూస్తూ ఊరుకోమని.. రాబోయే రోజుల్లో తప్పకుండా దాడులు చేస్తామని అన్నారు.

కాగా, ఎవరైనా చనిపోతే అక్కడ భగవద్గీత వినిపించడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. చనిపోయిన మనిషి కుటుంబం, బంధువులు, స్నేహితులు దుఖంలో ఉంటారు. వాళ్లు ఎంతో ఆవేదనలో ఉంటారు. ఆ సమయంలో భగవద్గీతలోని కొన్ని మాటలు వినిపిస్తారు. 'జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ.. తస్మాదపరిహార్యే ర్థేన త్వం శోచితుమర్హసి'.. అంటే 'పుట్టినవానికి మరణం తప్పదు; మరణించినవానికి పుట్టుక తప్పదు. తప్పించుకోవడానికి వీలులేని ఈ విషయంలో నువ్వు దుఃఖించడం తగదు' అని వారిని ఓదార్చేందుకు మైకుల్లో వినిపిస్తుంటారు.

ఈ విషయాలను పక్కన పెట్టి బండి సంజయ్ ఏకంగా భగవద్గీతను కించపరుస్తున్నారని వ్యాఖ్యానించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన సమయంలో భగవద్గీత పెట్టొద్దు అనడం హిందువులను అవమానించడమే అని అంటున్నారు. భగవద్గీత వినడం ఎలా హిందూ ధర్మాన్ని కించపరచడం అవుతుందో వివరించాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News