యాదాద్రిలో తడిబట్టలతో బండి సంజయ్ ప్రమాణం

బండి సంజయ్ తన సవాలులో భాగంగా శుక్రవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి చేరుకున్నారు. గుండంలో స్నానం చేసి.. తడి బట్టలతో ఆలయంలోకి వెళ్లారు.

Advertisement
Update:2022-10-28 16:20 IST

తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారం మరింతగా ముదురుతోంది. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఘటనతో బీజేపీకి సంబంధం లేదని ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ వాదిస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నించిందని కావాలనే ప్రచారం చేశారని ఆయన అంటున్నారు. ఈ క్రమంలో తాను యాదాద్రిలో ప్రమాణం చేస్తానని.. సీఎం కేసీఆర్ కూడా రావాలని గురువారం సవాలు విసిరారు.

బండి సంజయ్ తన సవాలులో భాగంగా శుక్రవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి చేరుకున్నారు. గుండంలో స్నానం చేసి.. తడి బట్టలతో ఆలయంలోకి వెళ్లారు. గర్భగుడి ముందు నిల్చొని.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ నాయకులకు ఎలాంటి ప్రమేయం లేదని ప్రమాణం చేశారు. 'ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు ఆడుతున్నారని చెప్పి తప్పుడు ఆరోపణలు టీఆర్ఎస్ పార్టీ శాసన సభ్యులు, నాయకులు చేశారు. ఇందులో భారతీయ జనతా పార్టీకి, నాయకులకు ఎలాంటి సంబంధం లేదు. అలాంటి ఆలోచనలే మాకు లేవు. లక్ష్మీనరసింహ స్వామి మా ఇలవేల్పు. అందుకే నేను తడిబట్టలతో వచ్చి.. అవన్నీ వాస్తవాలు కాదు, ఆరోపణలే అని స్వామి వారి ముందుకు వచ్చి వెల్లడిస్తున్నాను' అని ప్రమాణం చేశారు.

కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా సవాలు స్వీకరించి రమ్మన్నాను కానీ ఆయన రాలేదు. అయ్యగారూ ఆయన వచ్చారా అని సంజయ్ ప్రశ్నించగా.. ఆలయ పూజారి రాలేదని చెప్పారు. ఈ కొనుగోళ్ల వ్యవహారంలో బీజేపీకి, నాయకులకు ఎలాంటి సంబంధం లేదని బండి సంజయ్ మరోసారి ప్రమాణం చేశారు. కాగా, సంజయ్ ఈ ప్రమాణం చేస్తున్న సమయానికే మీడియాలో ఫామ్‌హౌస్ డీల్స్‌కు సంబంధించిన ఆడియో క్లిప్స్ బయటకు వచ్చాయి.

ఆ ఆడియో క్లిప్స్‌లో బీజేపీలోని కీలక వ్యక్తుల పేర్లను స్వామీజీ చెప్పడం గమనార్హం. మరో వైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం ఎమ్మెల్యేలను చేర్చుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. మొత్తానికి బీజేపీలో ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారం భారీ కుదుపు కుదిపిందని స్పష్టంగా తెలుస్తోంది.


Full View
Tags:    
Advertisement

Similar News