ప్రముఖులెవర్నీ వదలనంటున్న బీజేపీ..!

గత కొన్ని రోజులుగా బీజేపీకి కీలక నేతలు తరచూ తెలంగాణలో పర్యటిస్తున్నారు. అంతేకాదు తెలంగాణకు కీలక నేతలు ఎవరు వచ్చినా ఏదో ఒక రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తులతో భేటీ అవుతున్నారు.

Advertisement
Update:2022-09-17 14:27 IST

భారతీయ జనతా పార్టీ తన ఫోకస్ మొత్తం తెలంగాణపైనే పెట్టింది. సౌత్‌లో బీజేపీకి కర్ణాటక రాష్ట్రం తర్వాత తెలంగాణలో మాత్రమే పట్టుంది. మిగతా రాష్ట్రాల్లో కనీస స్థాయిలో కూడా లేదు. ప్రస్తుతం కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణలో కూడా ఎలాగైనా అధికారం సాధించాలని ఉవ్విళ్ళూరుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఇక్కడ జెండా పాతాలని చూస్తోంది. అందుకే కేంద్రమంత్రులు, కీలక బీజేపీ నాయకులు వరుసగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారు.

గత కొన్ని రోజులుగా బీజేపీకి కీలక నేతలు తరచూ తెలంగాణలో పర్యటిస్తున్నారు. అంతేకాదు తెలంగాణకు కీలక నేతలు ఎవరు వచ్చినా ఏదో ఒక రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తులతో భేటీ అవుతున్నారు. కొద్ది రోజుల కిందట కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ లో పర్యటించిన సమయంలో ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్‌ను పిలిపించుకుని భేటీ అయ్యారు. మహిళా క్రికెటర్ మిథాలీరాజ్‌ను కూడా ఆయన కలిశారు.

ఆ తర్వాత బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించిన సమయంలో యంగ్ హీరో నితిన్‌తో భేటీ అయ్యారు. నిన్న హైదరాబాద్‌లో ప్రముఖ హీరో కృష్ణంరాజు సంస్మరణ సభ జరుగగా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హాజరయ్యారు.

ఇవాళ తెలంగాణలో పర్యటించిన అమిత్ షా ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో భేటీ అయ్యారు. ఇలా తెలంగాణ పర్యటనకు వస్తున్న బీజేపీ నాయకులు ఎవరో ఒక ప్రముఖుడిని కలుస్తూ రాజకీయంగా కాకరేపడమే కాకుండా నిత్యం మీడియాలో నానేవిధంగా చూసుకుంటున్నారు. ఏదో ఒక విధంగా పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్నారు. కాగా అమిత్ షాని కలిసిన అనంతరం పుల్లెల గోపీచంద్ మీడియాతో మాట్లాడుతూ అమిత్ షాతో భేటీలో రాజకీయాలకు సంబంధించిన అంశాలు ప్రస్తావనకు రాలేదని స్పష్టం చేశారు. కేవలం క్రీడాకారులకు వర్తించే కేంద్ర పథకాలపైన చర్చించినట్లు తెలిపారు.


Tags:    
Advertisement

Similar News