అజారుద్దీన్ సార్.. ఆ 11,450 టికెట్లు ఎటు పోయాయి.?

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం సామర్థ్యం 52 వేలు. కానీ మ్యాచ్ జరిగే సమయంలో కేవలం 38వేల టికెట్లు మాత్రమే విక్రయిస్తారు. మూడో టీ20కి సంబంధించి 11,450 టికెట్లను పేటీఎం ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 15న విక్రయించింది.

Advertisement
Update:2022-09-24 10:42 IST

ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన మూడో టీ20 టికెట్ల విక్రయాలకు సంబంధించిన వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. జింఖానా వద్ద జరిగిన తోపులాట విషయంలో హెచ్‌సీఏ అధక్షుడు అజారుద్దీన్‌దే తప్పని అందరూ ఆరోపిస్తున్నారు. అజార్, అసోసియేషన్ నిర్లక్ష్యం వల్లే ఇంత రాద్ధాంతం జరిగిందని పోలీసులు కూడా చెబుతున్నారు. చివరకు తప్పు దిద్దుకునేందుకు జింఖానాలో తూతూమంత్రంగా ఆఫ్‌లైన్ టికెట్లు విక్రయించారు. శుక్రవారం సాయంత్రం టికెట్లన్నీ అమ్మేశామని.. వాటి లెక్కలు ఇవే అంటూ అజార్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. అయితే అజారుద్దీన్ చెబుతున్న లెక్కలకు, ఉప్పల్ స్టేడియంలో అందుబాటులో ఉన్న సీట్లకు మధ్య పొంతన కుదరడం లేదు. 11,450 టికెట్లు ఏమయ్యాయని అజారుద్దీన్ కాదు కదా.. కనీసం అసోసియేషన్ కూడా చెప్పలేక పోతోంది. ఇంతకు అన్ని వేల టికెట్లు ఎటు పోయాయనేది ప్రశ్నార్థకంగా మారింది.

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం సామర్థ్యం 52 వేలు. కానీ మ్యాచ్ జరిగే సమయంలో కేవలం 38వేల టికెట్లు మాత్రమే విక్రయిస్తారు. మూడో టీ20కి సంబంధించి 11,450 టికెట్లను పేటీఎం ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 15న విక్రయించింది. ఇక 4 వేల టికెట్లు కార్పొరేట్ కంపెనీలకు, 2,100 టికెట్లు ఆఫ్‌లైన్ సేల్స్ ద్వారా జింఖానాలో అమ్మారు. మరో 3వేల టికెట్లను మ్యాచ్ జరిగే రోజు (సెప్టెంబర్ 25) ఉప్పల్ స్టేడియం వద్ద అమ్మకానికి పెడతారు. 6వేల టికెట్లను పాసుల రూపంలో ఇచ్చారు. మొత్తం లెక్క చూస్తే 26,550 టికెట్లు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. అయితే 38 వేల టికెట్లలో 26,550 టికెట్లకే లెక్క చూపెట్టారు. కానీ మిగిలిన 11,450 టికెట్లు ఏమయ్యాయనేది అజారుద్దీన్ కూడా చెప్పడం లేదు.

ఆ టికెట్లను అజారుద్దీన్ అండ్ టీమ్ వాడుకుంటోందా?

హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అజారుద్దీన్ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగుస్తోంది. ఆ తర్వాత మూడేళ్ల కాలానికి అధ్యక్షుడితో పాటు పాలక వర్గాన్ని ఎన్నుకోవల్సి ఉన్నది. గతంలో అజారుద్దీన్ ప్యానల్ పూర్తిగా గెలవక పోవడంతో అతడికి తగిన సహకారం అందలేదు. అందుకే ఈసారి ఎన్నికల్లో తన ప్యానల్‌ను గెలిపించుకోవడానికి అజారుద్దీన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వీఐపీలు, హెచ్‌సీఏ సభ్యులు, అనుసంధాన క్లబ్‌లలో ఓటు హక్కు ఉన్న వారికి టికెట్లను తాయిలాలుగా పంచారనే ఆరోపణలు వస్తున్నాయి. కీలకమైన సౌత్ పెవీలియన్ దగ్గర ఉన్న టికెట్లను పోలీసులు, జీహెచ్ఎంసీ, హెచ్‌సీఏ క్లబ్‌లకు కేటాయించారు. ఇక బౌండరీ లైన్‌కు దగ్గరగా, ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్ చేరువలో ఉండే సీట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ తాను అనుకున్న వారికి పంచేశారని అజార్ వర్గంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అధ్యక్షుడిగా అజారుద్దీన్ విఫలం అయ్యారని గతంలో ప్రెసిడెంట్‌గా పని చేసిన జి. వివేక్ అన్నారు. గతంలో తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు ఐపీఎల్ మూడు సీజన్లను విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. ఐపీఎల్ ఫైనల్ కూడా తమ హయాంలో జరిగిందని.. చిన్న చిన్న పొరపాట్లు తప్ప ఏనాడూ ఇంత రచ్చ జరగలేదని ఆయన గుర్తు చేశారు. టికెట్ల విషయంలో ఏదో ఒక గోల్ మాల్ జరిగే ఉంటుందని ఆయన అనుమానించారు.

అజారుద్దీన్ ప్రత్యర్థి వర్గం కూడా ఇవే అనుమానాలు వ్యక్తం చేస్తోంది. రాబోయే ఎన్నికల కోసం ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్లను వాడుకున్నారని ఆరోపిస్తుంది. లెక్కతేలని టికెట్ల విషయం తప్పకుండా సమావేశంలో ప్రశ్నిస్తామని అంటోంది. వీఐపీ పాస్‌లు కూడా భారీగా పక్కదారి పట్టాయని, పలువురు ఎమ్మెల్యేలు, మంత్రుల పేరుతో స్వాహా చేశారని చెబుతున్నారు. గవర్నర్ బాక్స్, సీఎం బాక్స్ కూడా ఈ సారి ఏర్పాటు చేయలేదని.. ఇందుకు కారణం ఏంటో చెప్పాలని నిలదీస్తున్నారు. మొత్తానికి మ్యాచ్ టికెట్ల దుమారం హెచ్‌సీఏను ఇప్పటిలో విడిచిపెట్టేలా లేదు. మరి అజారుద్దీన్ ఈ విషయంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News