గుట్టపైకి ఆటోలు.. కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకాలు
ఆటో కార్మికుల సంక్షేమానికి పాటుపడుతున్న బీఆర్‌ఎస్ పార్టీకే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు ఆటో డ్రైవర్లు. రాష్ట్రంలో మూడోసారి బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
ఆటో డ్రైవర్లకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇద్దరూ నిన్న రెండు శుభవార్తలు చెప్పారు. ఆటో డ్రైవర్లకు ఫిట్ నెస్ సర్టిఫికెట్ కి చార్జీలు మాఫీ చేస్తామని చెప్పారు సీఎం కేసీఆర్. ఇక యాదగిరిగుట్టలో కేటీఆర్ మరో శుభవార్త చెప్పారు. ఇప్పటి వరకు గుట్టపైకి ఆటోలకు అనుమతి లేదు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తే యాదాద్రిపైకి ఆటోలను కూడా అనుమతిస్తామని హామీ ఇచ్చారు కేటీఆర్. దీంతో ఆటో డ్రైవర్ల సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. ఈ రోజు వారు సీఎం కేసీఆర్, కేటీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత యాదగిరిగుట్టను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసింది. అభివృద్ధి కార్యక్రమాల అనంతరం ఆటోలను కొండపైకి అనుమతించలేదు. దీంతో ఆటో డ్రైవర్లు కొన్నేళ్లుగా ఉపాధి కోల్పోయామని ఇబ్బందిపడుతున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ హామీతో వారు సంబరాలు చేసుకుంటున్నారు. కేటీఆర్ ప్రకటనతో ఈ రోజు స్థానిక వైకుంఠ ద్వారం ముందు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ర్యాలీ నిర్వహించారు ఆటో డ్రైవర్లు.
బీఆర్ఎస్ కే మా మద్దతు..
ఆటో కార్మికుల సంక్షేమానికి పాటుపడుతున్న బీఆర్‌ఎస్ పార్టీకే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు ఆటో డ్రైవర్లు. రాష్ట్రంలో మూడోసారి బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఫిట్ నెస్ సర్టిఫికెట్ రుసుము మాఫీ చేయడం, యాదాద్రిపైకి ఆటోలను అనుమతించే నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేశారు.
♦