అవును...టీఆరెస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకుంటాం, తప్పేముంది... గొంతు మార్చిన కిషన్ రెడ్డి

టీఆరెస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకుంటే తప్పేం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. టీఆరెస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ళ వ్యవహారంలో తమకే సంబంధం లేదని నిన్న‌టి వరకు వాదించిన కిషన్ రెడ్డి ఈ రోజు మాట మార్చారు.

Advertisement
Update:2022-10-28 15:26 IST

టీఆరెస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర వ్యవహాహారం అనేక మలుపులు తిరుగుతోంది. టీఆరెస్ ఎమ్మెల్యే కెప్టెన్ రోహిత్ రెడ్డితో రామచంద్ర భారతి మాట్లాడిన మాటల ఆడియో బైటికి రావడంతో బీజేపీ నాయకుల గొంతు మారిపోయింది. అసలు ఆ వ్యవహారంతో తమకే సంబంధం లేదని, రామచంద్రభారతి, సింహయాజులుతో బీజేపీకి ఏం సంబంధం అని, నందకుమార్ తమకే కాదు టీఆరెస్ నేతలకు కూడా సన్నిహితమే అని నిన్నటి దాకా మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు మాట మార్చారు.

రాంచంద్ర భారతి, కెప్టెన్ రోహిత్ రెడ్డితో మాట్లాడిన మాటల్లో బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోస్ గురించి రావడం, తాను సంతోష్ తో మాట్లాడానని, అన్నీ ఆయనే చూసుకుంటారని, మీరు పార్టీలో చేరడాన్ని ఆయన ఓకే చేశారని రాంచంద్ర భారతి చెప్పడంతో వ్యవహారమంతా మారిపోయింది. ఈ ఆడియో పై కిషన్ రెడ్డి మాట్లాడుతూ టీఆరెస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంటే తప్పేముందని ఓ ఛానల్ తో మాట్లాడుతూ అన్నారు.

టీఆరెస్ ఎమ్మెల్యేలను బీజేపీలొ త‌ప్పకుండా చేర్చుకుంటాం. అందులో తప్పేముంది ? సంతోష్ దాకా ఎందుకు టీఆరెస్ ఎమ్మెల్యేలతో నేను కూడా మాట్లాడతా అని అన్నారు. మరి ఈడీ, ఐటీ, సీబీఐ లనుండి రక్షణ కల్పిస్తామని రామచంద్రభారతి రోహిత్ రెడ్డికి హామీ ఇచ్చారు కదా అంటే...అసలు రామచంద్ర భారతికి మాకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. ఆయన ఏమైనా ఈడీ డైరెక్టరా ? ఆయనెలా హామీ ఇస్తాడు అని ప్రశ్నించారు.

ఈ విధంగా కిషన్ రెడ్డి రెండు రకాల మాటలు మాట్లాడటం ద్వారా... టీఆరెస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర బైటపడ్డ తర్వాత తమనుతాము సమర్దించుకోవడంలో బీజేపీ నాయ‌కులు ఎంత అయోమయానికి, ఎంత గందరగోళానికి గురవుతున్నారో అర్దమవుతున్న‌ది.

అయితే కిషన్ రెడ్డి మాట్లాడిన దాన్ని బట్టి ఈ కుట్రలో బీఎల్ సంతోష్ హస్తముందని ఆయన ఒప్పుకున్నట్టేనా అని టీఆరెస్ అధికార ప్రతినిధి క్రిశాంక్ ట్విట్టర్ లో ప్రశ్నించారు.


Tags:    
Advertisement

Similar News