అధికారులపై దాడులు సరికాదు.. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం
మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు
అధికారులపై దాడులు సరికాదని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలుపాలి కాని హింసకు తావులేదని మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రైతుల దాడిలో గాయపడ్డ కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డిని బుధవారం వారు పరామర్శించారు. ఈ సందర్భంగా దామోదర మాట్లాడుతూ, లగచర్లలో జరిగిన ఘటనలో రాజకీయ కుట్ర ఉందని అనుమానిస్తున్నామన్నారు. దాడిలో పాల్గొన్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేసి తమ హక్కులు సాధించుకున్నారని అన్నారు. తమ ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలు, సూచనలను గౌరవిస్తుందన్నారు. ప్రజలకు మేలు జరిగిలే చర్యలు తీసుకుంటుందన్నారు. దాడితో సంబంధం లేనివాళ్లను ఇబ్బంది పెట్టబోమన్నారు. దాడుల వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. అధికారులపై దాడి దురదృష్టకరమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఘటన వెనుక ఉన్నవాళ్లను గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. హింస ద్వారా ఏదీ సాధించలేరని అన్నారు. మంత్రుల వెంట ఎమ్మెల్యే కాలె యాదయ్య, కాంగ్రెస్ నాయకులు మధుసూదన్ రెడ్డి, రామ్మోహన్ గౌడ్, శేఖర్ తదితరులు ఉన్నారు.