మోదీ హయాంలో మైనార్టీలపై రికార్డు స్థాయిలో దాడులు
మోదీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు చిదంబరం. దేశంలో మత స్వేచ్ఛ లేదని ధ్వజమెత్తారు.
2017-21 సంవత్సరాల మధ్య భారత్ లో మైనార్టీలపై జరిగిన దాడులు 2,900
ప్రభుత్వ ఆంక్షలతో విదేశీ నిధులు పొందలేకపోయిన క్రైస్తవ, మైనార్టీ సంస్థలు 6,222
3.30 కోట్ల జనాభా ఉన్న క్రైస్తవులకు కేంద్ర మంత్రివర్గంలో ఒకే ఒక్కస్థానం.
దేశ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా 20 నెలల్లో 6.8 శాతం ధరల పెరుగుదల
దేశంలోని పట్టభద్రుల్లో నిరుద్యోగులు 42శాతం మంది..
ఇవన్నీ మోదీ హయాంలోని బీజేపీ ప్రభుత్వం సాధించిన ఘనతలు. మోదీ గద్దెనెక్కిన తర్వాత జరిగిన ఈ పరిణామాలు భారత పురోభివృద్ధిని వెనక్కు నెడుతున్నాయని మండిపడ్డారు మాజీ కేంద్ర మంత్రి చిదంబరం.
దేశంలో క్రిస్టియన్, ముస్లిం మైనార్టీలు భయంతో బతుకుతున్నారని అన్నారు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం. వారు కూడా దేశ పౌరులే అయినా ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. హైదరాబాద్ లో క్రిస్టియన్ కో–ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ క్రైస్తవ హక్కుల సమా వేశానికి హాజరైన ఆయన మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే.. తెలంగాణ కూడా మరో మణిపూర్ అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, క్రిస్టియన్ కోఆర్డినేషన్ కమిటీ నాయకులు పాల్గొన్నారు.
మోదీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు చిదంబరం. దేశంలో మత స్వేచ్ఛ లేదని ధ్వజమెత్తారు. కర్నాటక ఎన్నికలు మోదీ పీఠాన్ని కదిలించాయని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో కేంద్రంలో బీజేపీ గద్దె దిగక తప్పదని పేర్కొన్నారు.