పథకం ప్రకారమే కలెక్టర్, అధికారులపై దాడి
ఈ దాడి వెనుక ఎవరున్నా విడిచిపెట్టం : మంత్రి శ్రీధర్ బాబు
వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ సహా అధికారులపై లగచర్ల గ్రామంలో పథకం ప్రకారమే దాడి చేశారని, ఈ దాడిని ఖండిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ మహేశ్ భగవత్, వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ సహా పలువురు అధికారులు మంత్రితో సమావేశమయ్యారు. ఆ తర్వాత సీఎల్పీలోని తన ఆఫీస్‌లో మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. పథకం ప్రకారమే రైతులను రెచ్చగొట్టి కలెక్టర్ సహా అధికారులపై భౌతిక దాడికి పాల్పడేలా చేశారని అన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేస్తామన్నారు. దాడి వెనుక ఉన్న కుట్రదారులెవరు, కలెక్టర్ ను తప్పుదోవ పట్టించి గ్రామంలోకి తీసుకెళ్లింది ఎవరు అన్నదానిపై సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు. లగచర్ల దాడి వెనుక ఎవరున్నా విడిచిపెట్టేది లేదన్నారు. అభివృద్ధిని అడ్డుకోవాలని ఎవరు ప్రయత్నించినా చర్యలు తప్పవన్నారు. ప్రజాస్వామ్యంలో రైతులు, ప్రజలకు ఉన్న అభ్యంతరాలు చెప్పుకునే అవకాశం ఉంటుందని, భౌతిక దాడులు మాత్రం మంచివి కావన్నారు. ప్రభుత్వ విధానాలను అడ్డుకునే ప్రయత్నం ఎవరు చేసినా ఉపేక్షించబోమన్నారు. అధికారం పోయిందనే ఆక్రోషంతో బీఆర్‌ఎస్ కుట్రలు చేస్తుందన్నారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అడ్డుకోవడం బీఆర్‌ఎస్ కు అలవాటుగా మారిందన్నారు. అభివృద్ధికి అవరోధాలు కలిగించే వారిగా బీఆర్‌ఎస్ నేతలు తయారయ్యారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రోజు ఇలా వ్యవహరించలేదన్నారు. రాష్ట్ర ప్రగతికి పరిశ్రమలు ఎంతో ముఖ్యమని తెలిపారు.