అధికారంలోకి వచ్చిన వెంటనే.. అంటే అర్థమేంటి..?

అధికారంలోకి వచ్చిన వెంటనే అంటే ఇదేనా అంటూ ప్రతిపక్షం ప్రజల తరపున ప్రశ్నిస్తోంది. గ్యారెంటీలు ఎంత లేటయితే ఖజానాకు అంత మేలు అని కాంగ్రెస్ లైట్ తీసుకుంది.

Advertisement
Update:2024-01-22 08:10 IST

అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నిటిలో ఒక కామన్ పాయింట్ ఉంది. ఆరు గ్యారెంటీలతో కలిపి ఏ హామీ అయినా అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేరుస్తామన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక మహిళల ఉచిత రవాణా పథకం మాత్రం హడావిడిగా పట్టాలెక్కింది. ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10లక్షలకు పెంపు కూడా వెంటనే అమలులోకి వచ్చింది. ఇవన్నీ ప్రధాన హామీలు కావు, అందులో కొన్ని కీలక పాయింట్లు మాత్రమే. మరి ప్రధాన హామీల అమలు ఎప్పటినుంచి అంటే కచ్చితంగా కాంగ్రెస్ నేతల వద్ద సమాధానం లేదు. తాజాగా పెన్షన్ పెంపు కూడా వాయిదా పడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటి నెల పెన్షన్ పెంచలేదంటే దానికో అర్థముంది. రెండో నెల కూడా పెన్షన్లు పెరగలేదంటే ఉద్దేశపూర్వకంగా ఆ హామీ అమలుని ఆలస్యం చేస్తున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది.

ఎన్నికల ముందు ఆసరా పెన్షన్లకు సంబంధించి కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ హామీలిచ్చాయి. ఏపీలో జగన్ విధానం బాగుందని.. అలాగే తెలంగాణలో కూడా పెన్షన్లు పెంచుకుంటూ పోతామని చెప్పారు అప్పటి సీఎం కేసీఆర్. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే సాధారణ పెన్షన్ ను రూ.4వేలకు, దివ్యాంగుల పెన్షన్ ను రూ.6వేలకు పెంచుతామన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రెండో నెలకూడా పాత పెన్షనే పంపిణీ అయ్యే అవకాశం ఉండటం గమనార్హం.

తెలంగాణలో ఆసరా పెన్షన్లు ఈ నెల కూడా పాత పద్ధతిలోనే విడుదల చేసేందుకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ములు జమ చేస్తారు. ప్రస్తుతం సాధారణ పెన్షన్ రూ.2,016, దివ్యాంగుల పెన్షన్ రూ.3,016 గా ఉంది. రాష్ట్రంలో వివిధ వర్గాలవారు మొత్తం 43,96,667 మంది పింఛన్లు పొందుతున్నారు. వీరికోసం ప్రతినెలా వెయ్యి కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఈ నెల కూడా అంతే మొత్తం విడుదలవుతుంది.

కొత్త పెన్షన్లతో మెలిక

ప్రస్తుతం ప్రజా పాలన దరఖాస్తుల ద్వారా కొత్తగా పెన్షన్లు కోరేవారి వివరాలు తీసుకుంది ప్రభుత్వం. 24.84 లక్షలమంది పెన్షన్లకోసం దరఖాస్తులు చేసుకున్నారు. కొత్త పెన్షన్లతో కలిపి పెంపు ఉంటుందని కాంగ్రెస్ నేతలు చూచాయగా చెప్పారు. మరి కొత్త పెన్షన్లు వచ్చే వరకు పాతవారు పాత పెన్షన్ తోనే సరిపెట్టుకోవాలన్నమాట. అధికారంలోకి వచ్చిన వెంటనే అంటే ఇదేనా అంటూ ప్రతిపక్షం ప్రజల తరపున ప్రశ్నిస్తోంది. గ్యారెంటీలు ఎంత లేటయితే ఖజానాకు అంత మేలు అని కాంగ్రెస్ లైట్ తీసుకుంది. 

Tags:    
Advertisement

Similar News