ఖమ్మంలో కారు జోరు పెరుగుతోందా..!
ఇప్పుడు సీన్ మారిపోయింది. కాంగ్రెస్ నుంచి నలుగురు, టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు కారెక్కేశారు. వారే ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్లతో పోటీలో నిలిచారు. దీంతో ఈసారి బీఆర్ఎస్‌కు విజయావకాశాలు మెరుగయ్యాయి.
గత ఎన్నికల్లో పరాభవం పాలైనా ఖమ్మం జిల్లాలో మాత్రం కాంగ్రెస్ పట్టు నిలబెట్టుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 స్థానాలకుగాను ఆరు స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ గత ఎన్నికల్లో గెలిచిన 21 స్థానాల్లో 30 శాతం ఇక్కడి నుంచి వచ్చినవే. దీనికితోడు కాంగ్రెస్ మిత్రపక్షంగా పోటీ చేసిన టీడీపీ సత్తుపల్లి, అశ్వారావుపేట స్థానాలు కూడా కలిస్తే ఆ లెక్క మొత్తం 8. అధికారం చేజిక్కుంచుకున్నప్పటికీ బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్)కు దక్కింది ఒకే ఒక్క స్థానం. కానీ, ఇప్పుడు సీన్ మారిపోయింది. కాంగ్రెస్ నుంచి నలుగురు, టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు కారెక్కేశారు. వారే ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్లతో పోటీలో నిలిచారు. దీంతో ఈసారి బీఆర్ఎస్‌కు విజయావకాశాలు మెరుగయ్యాయి.
ఇలా మారారు
పాలేరులో కాంగ్రెస్ తరఫున గెలిచిన కందాళ ఉపేందర్‌రెడ్డి తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థులుగా కొత్తగూడెం నుంచి గెలిచిన వనమా వెంకటేశ్వరరావు, పినపాక నుంచి గెలిచిన రేగ కాంతారావు, ఇల్లెందు నుంచి గెలిచిన హరిప్రియా నాయక్ కూడా తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరారు. వీరే ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు. సత్తుపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా నిలబడి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేట నుంచి గెలిచిన మెచ్చా నాగేశ్వరరావు కూడా బీఆర్ఎస్‌లోకి వచ్చి మళ్లీ పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో అధికార పార్టీని ఎదురొడ్డి గెలిచిన ఈ నేతలంతా ఇప్పుడు అధికార పార్టీ అండతో గెలుస్తామని ధీమాగా ఉన్నారు. దీనికి తోడు ఖమ్మంలో పాగా వేయాలని బీఆర్ఎస్ నాలుగేళ్లుగా ఇక్కడ బాగా దృష్టి పెట్టింది. ఎమ్మెల్యేలే కాదు దిగువ స్థాయిలోనూ క్యాడర్‌ను పెంచుకోగలిగింది.
దీటైన అభ్యర్థులను వెతుక్కోలేని కాంగ్రెస్
మరోవైపు తమ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరిపోయి మూడు నాలుగేళ్లు అవుతున్నా ప్రత్యామ్నాయ అభ్యర్థులను తయారు చేసుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. పినపాకలో గతంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఓడిపోయిన పాయం వెంకటేశ్వర్లును చేర్చుకుని టికెటిచ్చింది. అలాగే ఇల్లెందు నుంచి ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి కోరం కనకయ్య ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి. 2014లో ఖమ్మం నుంచి ఓడిపోయి, 2018లో పోటీ చేయని తుమ్మల ఇక్కడ మంత్రి పువ్వాడ అజయ్‌పై గెలవడంలో ఏ మాత్రం సఫలీకృతుడవుతారనేది సందేహమే అంటున్నారు. మధిర నుంచి మళ్లీ పోటీపడుతున్న మల్లు భట్టి విక్రమార్క, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, పాలేరులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రమే గట్టి పోటీ ఇవ్వగలరని బీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నట్లు సమాచారం. దీనికితోడు పాలేరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా కూడా పని చేసిన సంబాని చంద్రశేఖర్ లాంటి నేత వీడటం కాంగ్రెస్‌కు కొంత మైనస్సే.