12వ శతాబ్ది ఘట్టుప్పల్ నంది విగ్రహాన్ని కాపాడుకోవాలి.. - పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి
. స్థానిక పురాణమఠం విద్యాసాగర్, మార్కండేశ్వరాలయ కమిటీ ఛైర్మన్, అవ్వారి శ్రీనివాస్ ఇచ్చిన సమాచారం మేరకు ఆయన ఆదివారం నాడు నంది విగ్రహాన్ని, అక్కడే ఉన్న శిథిల శివాలయాన్ని పరిశీలించారు.
నల్గొండ జిల్లాలోని ఘట్టుప్పల్ శివారులో ఉన్న వినాయక బావి దగ్గరున్న కందూరు చోళుల కాలపు నంది విగ్రహాన్ని కాపాడుకోవాలని, పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. స్థానిక పురాణమఠం విద్యాసాగర్, మార్కండేశ్వరాలయ కమిటీ ఛైర్మన్, అవ్వారి శ్రీనివాస్ ఇచ్చిన సమాచారం మేరకు ఆయన ఆదివారం నాడు నంది విగ్రహాన్ని, అక్కడే ఉన్న శిథిల శివాలయాన్ని పరిశీలించారు.
పునాదుల వరకు ఉన్న శిథిల శివాలయం, భిన్నమైన నంది విగ్రహం క్రీ.శ. 12వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పానగల్లు నుంచి పాలించిన కందూరు చోళుల కాలం నాటివని, అద్భుత శిల్పకళకు అద్దం పడుతుందన్న 800 ఏళ్ల నాటి విగ్రహాన్ని, గ్రామంలోని మార్కండేశ్వరాలయానికి తరలించి భద్రపరచి, భావితరాలకు అందించాలని శివనాగిరెడ్డి స్థానికులకు విజ్ఞప్తి చేశారు. ఈ విగ్రహం చారిత్రక, ప్రాధాన్యత దృష్ట్యా తరలించి కాపాడుకుంటామని వారు హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జల్లా షణ్ముఖ, నామని జగన్నాథం, చెరుపల్లి భాస్కర్, దోర్నాల నరేందర్, కర్నాటి శ్రీనివాస్ పాల్గొన్నారని శివనాగిరెడ్డి చెప్పారు.