సీనియర్ నాయకుడిని నియమించండి.. లేకుంటే టీ-కాంగ్రెస్ పని ఖతమ్.. అధిష్టానానికి దిగ్విజయ్ సూచన
తెలంగాణ కాంగ్రెస్‌లో చాలా మంది సీనియర్లు, వృద్ద నాయకులు ఉన్నారు. కాబట్టి.. ఒక సీనియర్ ఏఐసీసీ నాయకుడిని అక్కడ ఇంచార్జీగా నియమిస్తే తప్ప వారిని కంట్రోల్ చేయడం కుదరదని దిగ్విజయ్ సూచించారు.
తెలంగాణలో కాస్తో కూస్తో మిగిలిన కాంగ్రెస్ బతికి బట్ట కట్టాలంటే సీనియర్ నాయకుడిని రాష్ట్ర వ్యవహారాల కోసం నియమించాలని అధిష్టానానికి దిగ్విజయ్ సింగ్ సూచించారు. పీసీసీ కమిటీల నియామకం ఇటీవల టీ-కాంగ్రెస్‌లో వివాదాన్ని తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. వలస నాయకులు, సీనియర్ నాయకులు అంటూ రెండు వర్గాలుగా విడిపోయి తమ విభేదాలను రచ్చకు ఎక్కించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క వంటి సీనియర్ నేతలు ఏకంగా వేరు కుంపటి పెట్టి 'సేవ్ కాంగ్రెస్' అంటూ మీడియా సమావేశాలు నిర్వహించారు. దీంతో మేల్కొన్న అధిష్టానం ఏఐసీసీ దూతగా దిగ్విజయ్ సింగ్‌ను పంపింది.
గత వారంలో కీలక నేతలతో విడివిడిగా భేటీ అయిన దిగ్విజయ్ సింగ్.. ఢిల్లీలో పూర్తి స్థాయి నివేదికను హైకమాండ్‌కు అందించారు. అనుభవం ఉన్న నాయకుడిని ఏఐసీసీ ప్రతినిధిగా, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా నియమిస్తే తప్ప టీ-కాంగ్రెస్‌లో విభేదాలు సమసి పోవని ఆయన నివేదికలో పేర్కొన్నారు. పార్టీలో సీనియర్లు, ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి మధ్య తప్పకుండా సయోధ్య కుదర్చాలని, వెంటనే నిర్ణయం తీసుకోకపోతే పార్టీ మరింతగా నాశనం అవుతుందని ఆయన హైకమాండ్‌కు తెలిపారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో చాలా మంది సీనియర్లు, వృద్ద నాయకులు ఉన్నారు. కాబట్టి.. ఒక సీనియర్ ఏఐసీసీ నాయకుడిని అక్కడ ఇంచార్జీగా నియమిస్తే తప్ప వారిని కంట్రోల్ చేయడం కుదరదు. జూనియర్లకు వాళ్లు మాట వినే అవకాశం కనపడటం లేదని జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు ఇచ్చిన రిపోర్టులో తెలిపారు. ప్రస్తుతం పని చేస్తున్న తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా వయసులో చిన్నవారని.. అందుకే సీనియర్లు వారి మాటలను పెద్దగా పట్టించుకోవడం లేదని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సమస్యను సోనియా, రాహుల్, ప్రియాంకతో మల్లిఖార్జున్ ఖర్గే చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నది. జనవరి మొదటి వారంలో కొన్ని మార్పులు జరిగవచ్చని తెలుస్తున్నది. మాణిక్యం ఠాకూర్ ప్లేస్‌లో మరో వ్యక్తిని నియమించే అవకాశాలను కూడా కొట్టేయలేమని పార్టీ వర్గాలు అంటున్నారు. మాణిక్యం ఠాకూర్ కూడా తనను తెలంగాణ బాధ్యతల నుంచి తప్పించాలని ఏఐసీసీని కోరుతున్నారు.
అధిష్టానానికి ఇచ్చిన రిపోర్టులో సీనియర్లు, వలస నేతల వాదనలు అన్నీ చేర్చి దిగ్విజయ్ సమర్పించినట్లు తెలుస్తున్నది. ఇప్పుడున్న గొడవలు తాత్కాలికంగా సద్దుమణిగినా.. మళ్లీ ఏదో ఒక రోజు బయటపడక మానవని దిగ్విజయ్ పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా రాష్ట్రంపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. సీనియర్లు, వలస నాయకుల మధ్య కోఆర్డినేషన్ కోసం ఒక హైలెవెల్ కమిటీని నియమిస్తే కూడా బాగుంటుందని దిగ్విజయ్ పేర్కొన్నట్లు తెలుస్తున్నది. ఇద్దరు సీనియర్ ఏఐసీసీ లీడర్లు, టీపీసీసీ ప్రెసిడెంట్, అసెంబ్లీ, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్లతో కూడిన హైలెవెల్ కమిటీ అయితే సమర్థవంతంగా పని చేసే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే టీపీసీసీ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డి కొనసాగాలని వలస నాయకులతో పాటు కొందరు సీనియర్ నాయకులు కూడా అభిప్రాయపడినట్లు నివేదికలో పేర్కొన్నారు. అదే సమయంలో సీనియర్ నాయకులు మాత్రం రేవంత్ నాయకత్వాన్ని సమర్థించడం లేదు. సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ జీవన్ రెడ్డితో రేవంత్ రెడ్డికి సమన్వయం లేదని.. అసలు సమస్య అక్కడే వస్తుందని కూడా నివేదికలో చేర్చారు. మరి దిగ్విజన్ సింగ్ చేసిన సూచనలను ఏఐసీసీ ఎంత మేరకు తీసుకుంటుందనేది అనుమానమే. జనవరి మొదటి వారంలో టీపీసీసీలో మాత్రం కొన్ని మార్పులు మాత్రం చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.