రెచ్చగొట్టొద్దు.. బొత్సపై తెలంగాణ మంత్రుల ఫైర్

ఇరు రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థ గురించి తాను చెప్పిన లెక్కలపై స్పందించాకే బొత్స హైదరాబాద్ లో అడుగుపెట్టాలన్నారు. బొత్స వ్యాఖ్యలపై జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, వెంటనే ఆయన్ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు మంత్రి గంగుల.

Advertisement
Update:2023-07-13 15:29 IST

విజయవాడలో ట్రిపుల్ ఐటీ ప్రవేశాల జాబితా విడుదల సందర్భంగా ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ‘‘ఏపీ విద్యా విధానాన్ని ఆఫ్ట్రాల్‌ తెలంగాణతో పోల్చి చూడటం సరికాదు. అక్కడంతా చూచి రాతలు, కుంభకోణాలు రోజూ చూస్తున్నాం. ఉపాధ్యాయుల బదిలీలు కూడా చేసుకోలేని దుస్థితి తెలంగాణది. మన విధానం మనది.. మన ఆలోచనలు మనవి’’ అని బొత్స అన్నారు. ఈ కామెంట్లపై తెలంగాణ మంత్రులు ఘాటుగా బదులిచ్చారు. మమ్మల్ని రెచ్చగొట్టొద్దు అంటూనే ఏపీని, ఏపీ విధానాలను ఘాటుగా విమర్శించారు తెలంగాణ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్.

రాజధాని లేని రాష్ట్రం ఏపీ అని, రాజధాని ఎక్కడ ఉంటుందో చెప్పుకోలేని పరిస్థితిలో ఏపీ నేతలు ఉన్నారని ఎద్దేవా చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ఏపీ నేతలకు లేదన్నారు. కనీసం నెలకోసారి హైదరాబాద్ రాకపోతే వారి ప్రాణాలకు విశ్రాంతి ఉండదన్నారు. TSPSC పరీక్షలపై డౌట్‌ ఉందని డయల్ 100‌కు ఫోన్ వస్తే.. ఎంక్వైరీ చేసి, పాతళంలోకి వెళ్లి లీకేజ్‌ను పట్టుకున్నామని చెప్పారు శ్రీనివాస్ గౌడ్. తెలంగాణలో చూచి రాతలంటూ బొత్స రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఏ రాష్ట్రంలో ఎన్ని ఆసుపత్రులు నిర్మించారో అందరికీ తెలుసన్నారు. అనారోగ్యానికి గురైనప్పుడు వైద్యం కోసం ఎవరు ఎక్కడికి వస్తారో తెలుసుకదా అని అడిగారు. ఏపీ నుంచి బతుకుదెరువు కోసం హైదరాబాద్ వస్తే కడుపులో పెట్టుకుంటామన్నారు. రాజకీయ లబ్ధి కోసమే బొత్స మాట్లాడుతున్నారని మండిపడ్డారు శ్రీనివాస్ గౌడ్.

బొత్సను బర్తరఫ్ చేయాలి..

ఏపీ మంత్రి బొత్స వ్యాఖ్యలపై మంత్రి గంగుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పై ఇంకా విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ మంత్రిగా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన బొత్స, ఇప్పుడు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గంగుల. రాష్ట్రం వేరుపడిన తర్వాత కూడా తెలంగాణపై విషం చిమ్మడమేంటని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చాకే రాష్ట్రంలో విద్యావ్యవస్థ మెరుగుపడిందని అన్నారు. నాడు మంత్రులుగా ఉన్న ఆంధ్ర నాయకుల వైఫల్యం వల్ల ఎంతోమంది తెలంగాణ బిడ్డలు చదువుకోలేకపోయారని, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కేవలం 297 గురుకులాలు మాత్రమే ఉండేవని, నేడు తెలంగాణ లో 1009 గురుకులాలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఇప్పటికీ ఏపీలో 380 గురుకులాలే ఉన్నాయని అన్నారు గంగుల. హైదరాబాద్ మీద మళ్ళీ ఆంధ్ర నాయకుల కన్ను పడిందా అని ప్రశ్నించారు. ఇరు రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థ గురించి తాను చెప్పిన లెక్కలపై స్పందించాకే బొత్స హైదరాబాద్ లో అడుగుపెట్టాలన్నారు. బొత్స వ్యాఖ్యలపై జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, వెంటనే ఆయన్ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు మంత్రి గంగుల. 

Tags:    
Advertisement

Similar News