తెలంగాణ వ్యతిరేకివి.. ఆంధ్రా వెళ్లిపో.. కేవీపీ వ్యాఖ్యలకు వీహెచ్ కౌంటర్

తెలంగాణ ఉద్యమ సమయంలో ప్లకార్డులు పట్టుకొని విభజనకు వ్యతిరేకంగా వ్యవహరించిన కేవీపీ ఇలాంటి మాటలు మాట్లాడటం అవకాశవాదం అన్నారు.

Advertisement
Update:2023-09-04 07:14 IST

'నేను దశాబ్దాలుగా హైదరాబాద్‌లో ఉంటున్నాను. నా ఓటు హక్కు కూడా ఇక్కడే ఉంది. నన్ను కూడా తెలంగాణవాడిగా కలుపుకోండి. తన మరణం తర్వాత ఈ తెలంగాణ మట్టిలోనే కలిసిపోతా' అంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేవీపీ చేసిన వ్యాఖ్యలపై పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కాంగ్రెస్‌లో మిగతా నాయకులు సంగతి ఎలా ఉన్నా.. సీనియర్ నాయకుడు వీ. హనుమంతరావు మాత్రం తనదైన శైలిలో స్పందించారు. ఎంతటి వారినైనా వదలని వీహెచ్.. ఇప్పుడు కేవీపీని కూడా కడిగిపారేశారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ప్లకార్డులు పట్టుకొని విభజనకు వ్యతిరేకంగా వ్యవహరించిన కేవీపీ ఇలాంటి మాటలు మాట్లాడటం అవకాశవాదం అన్నారు. ఆ రోజు ఆయనకు తాను తెలంగాణ వాడిననే విషయం గుర్తుకు రాలేదా? అని వీహెచ్ ప్రశ్నించారు. తెలంగాణకు వచ్చి రాజకీయాలు చేద్దామనే ఆలోచనను కేవీపీ మానుకోవాలని సూచించారు. విభజన వద్దంటూ ప్లకార్డులు పట్టుకొని.. ఇప్పుడు తెలంగాణ వాడినే అంటే ఎవరూ నమ్మరని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందని.. కాబట్టి కేవీపీ అక్కడకు వెళ్లి పని చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు.

రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సంయుక్త నాయకత్వంలో తెలంగాణలో తప్పకుండా అధికారంలోకి వస్తాము. అంతా బాగున్న రాష్ట్రంలోకి రావడం ఎందుకని కేవీపీని వీహెచ్ ప్రశ్నించారు. కేవీపీ ఇలాంటి ఆలోచనలు మానుకోవాలని చెప్పారు. కాగా, వీహెచ్ వ్యాఖ్యల వెనుక వేరే ఆంతర్యం కూడా ఉందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్న కాలంలో కూడా వీహెచ్‌కు ఆయనతో సఖ్యత ఉండేది కాదు. గాంధీల కుటుంబానికి సన్నిహితుడిగా ఉండే వీహెచ్.. వైఎస్ఆర్‌ను మాత్రం విభేదించేవారు. అప్పటి నుంచే కేవీపీతో వీహెచ్‌కు విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు సమయం రావడంతో వీహెచ్ మరోసారి కేవీపీపై విరుచుకపడ్డారనే వ్యాఖ్యలు పార్టీలో వినిపిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News