స్పై కెమెరాలను పట్టించే 'యాంటీ రెడ్ ఐ'

'యాంటీ రెడ్ ఐ' పేరిట చేపడుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా శిక్షణ పొందిన యువతులు హాస్టళ్లు, షాపింగ్ మాల్స్ ని తనిఖీ చేస్తారు.

Advertisement
Update:2024-07-13 08:05 IST

స్పై కెమెరాలతో మహిళలను రహస్యంగా చిత్రీకరించి ఆ తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేసే బ్యాచ్ లు ఇటీవల పెచ్చుమీరాయి. మహిళలను రహస్యంగా చిత్రీకరించిన వీడియోలు సోషల్ మీడియాలో కూడా కోకొల్లలు. షాపింగ్ మాల్స్ లో ట్రయల్ రూమ్ లు, హోటల్ గదులు, లేడీస్ హాస్టళ్లు, పీజీలు.. ఇటీవల కాలంలో ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు తెలంగాణ పోలీసులు 'యాంటీ రెడ్ ఐ' ని తెరపైకి తెస్తున్నారు.

ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డులో, గోడ గడియారంలో, గోడలకు అంటించిన స్టిక్కర్ల చాటున, అద్దాల వెనక.. ఇలా స్పై కెమెరాలు ఎక్కడ పెట్టినా కనిపెట్టే అవకాశముంది. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి. అయితే తెలంగాణ పోలీసులు తొలిసారిగా స్పై కెమెరాలను కనిపెట్టేందుకు యువతులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. హైదరాబాద్ నగరంలో 300మంది ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ ని ఎంపిక చేసి వారికి శిక్షణ ఇవ్వడంతోపాటు స్పై కెమెరా డిటెక్టర్లను కూడా అందిస్తున్నారు. శిక్షణ ఇప్పటికే పూర్తి కాగా ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించాల్సి ఉంది.

'యాంటీ రెడ్ ఐ' పేరిట చేపడుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా శిక్షణ పొందిన యువతులు హాస్టళ్లు, షాపింగ్ మాల్స్ ని తనిఖీ చేస్తారు. అక్కడ బాత్ రూమ్ లు, ట్రయల్ రూమ్ లలో స్పై కెమెరాలు ఉన్నాయో లేదో చెక్ చేసి వాటికి సర్టిఫికెట్ ఇస్తారు. 'స్పై కెమెరా ఫ్రీ' అని ప్రభుత్వం ఇచ్చిన స్టిక్కర్ ని అక్కడ అతికిస్తారు. ఒకవేళ స్పై కెమెరాల ఆనవాళ్లు కనపడితే వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. త్వరలో 30వేలమంది వాలంటీర్లను తయారు చేస్తామంటున్నారు హైదరాబాద్ పోలీసులు. 

Tags:    
Advertisement

Similar News