తెలంగాణకు క్యూ కడుతున్న బ్యాంకింగ్, ఐటీ దిగ్గజాలు..
ఎకో ఫ్రెండ్లీ వెహికల్ టెక్నాలజీ అభివృద్ధి కోసం అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన జీరో ఎమిషన్ వెహికిల్ (జెడ్‌ఈవీ) రీసెర్చ్ సెంటర్‌తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
అమెరికాకు చెందిన బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్ సేవల సంస్థ ‘స్టేట్ స్ట్రీట్’ హైదరాబాద్ లోని తమ శాఖను మరింతగా విస్తరించే ప్రణాళికతో మంత్రి కేటీఆర్ ని కలిసింది. 2017 నుంచి హైదరాబాద్ లో స్టేట్ స్ట్రీట్ కార్యకలాపాలు నడుస్తున్నాయి. ఇప్పుడు భారీ విస్తరణకు ఆ సంస్థ అడుగులు వేస్తోంది. కొత్తగా 5వేలమంది ఉద్యోగులను నియమిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ నియామకంతో.. బోస్టన్ లోని స్టేట్ స్ట్రీట్ ప్రధాన కార్యాలయం తర్వాత, హైదరాబాద్ ఆఫీస్ అత్యంత పెద్దదిగా మారుతుంది. అకౌంటింగ్, హెచ్ఆర్ మొబిలిటీ.. తదితర విభాగాలకు హైదరాబాద్ ని ప్రపంచ కేంద్రంగా మారుస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సమావేశం తర్వాత 'గుడ్ న్యూస్ ఫ్రమ్ బోస్టన్' అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
క్లోవర్ టెక్స్ సంస్థ ప్రతినిధులు హైదరాబాద్ లో తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ని విస్తరించే ప్రణాళికతో మంత్రి కేటీఆర్ ని కలిసి చర్చించారు. బోస్టన్ లోని ప్రధాన కార్యాలయం తర్వాత రెండో ఆఫీస్ ని హైదరాబాద్ లోనే నెలకొల్పుతామని చెప్పారు. లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించి అవసరమైన సైంటిఫిక్ క్లౌడ్ కంప్యూటింగ్ లో క్లోవర్ టెక్స్ సంస్థకు మంచి పేరుంది. 100 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ సంస్థ హైదరాబాద్ లో తమ కార్యకలాపాలు మొదలు పెట్టబోతోంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు క్లోవర్ టెక్స్ ప్రతినిధులు.
ఆరమ్ ఈక్విటీ పార్ట్ నర్స్ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, డేటా సెంటర్ తదితర రంగాల్లో దాదాపు రూ.450 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఆరమ్ సంస్థ సిద్ధమైంది. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆరమ్ ఈక్విటీ తమ పెట్టుబడి ప్రణాళికలు వివరించింది.
డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్ సేవల దిగ్గజ సంస్థ గ్రిడ్ డైనమిక్స్ హోల్డింగ్స్, హైదరాబాద్ లోని తమ డెలివరీ కేంద్రాన్ని మరింత విస్తరిస్తామని తెలిపింది. తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తో శాన్ ఫ్రాన్సిస్కోలో సమావేశమైన ఆ సంస్థ ప్రతినిధులు.. హైదరాబాద్ లోని తమ డెలివరీ కేంద్రాన్ని విస్తరిస్తామని ప్రకటించారు. సిలికాన్ వ్యాలీ ప్రధాన కేంద్రంగా 2006లో ఏర్పాటైన ఈ సంస్థ అమెరికా, మెక్సికో, యూరప్ తోపాటు భారత్ లో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
ఇక ఎకో ఫ్రెండ్లీ వెహికల్ టెక్నాలజీ అభివృద్ధి కోసం అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన జీరో ఎమిషన్ వెహికిల్ (జెడ్‌ఈవీ) రీసెర్చ్ సెంటర్‌తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థ అభివృద్ధికి ఈ ఒప్పందం దోహదపడుతుందని తెలుస్తోంది.