ఫిరాయింపుల కాలంలో కడదాకా కమ్యూనిస్టుగా బతికిన ఆదర్శ నేత
ప్రశ్నించడమే ప్రజాస్వామ్యం అని గుండెల నిండా నమ్మిన వ్యక్తి సీతారాం ఏచూరి అన్న కేటీఆర్
ఓట్ల రాజకీయం వేరు, ప్రజల రాజకీయం వేరు. మేం ఓట్ల రాజకీయంలో వెనుకబడిన ప్రజల కోసం పోరాటంలో ముందున్నాం.. ప్రజల మనసుల్లో ఉన్నామన్న సీతారాం ఏచూరి చెప్పిన మాట గుర్తున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన సీతారాం ఏచూరి సంస్మరణ సభలో కేటీఆర్ పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ..పదవుల చుట్టూ పరిభ్రమించే నేటి రాజకీయాల్లో స్థిరంగా, సిద్ధాంతం కోసం నిలబడిన నాయకుడు ఏచూరి అని కొనియాడారు. ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల కాలంలో కడదాకా కమ్యూనిస్టుగా బతికిన ఆదర్శ నేత సీతారాం ఏచూరి అని కేటీఆర్ పేర్కొన్నారు.
నాయకులుగా, పాలకులుగా ఉండి పోరాడాలంటే తెలియని వారు ఎందరో ఉండొచ్చు. ప్రజలను ఓటు బ్యాంకుగా చూసేవారు మరెంతో మంది ఉన్నారు. కానీ ఉన్నత చదువులు చదువుకున్న కుటుంబంలో పుట్టి అణగారినవర్గాల కోసం ప్రశ్నించే గొంతుగా ఎదిగిన గొప్ప వ్యక్తిత్వం ఆయనది. అది చాలా గొప్ప విషయం. పోరాటాల నుంచి వచ్చిన నాయకులకు ప్రజల కష్టం, నష్టం తెలుస్తుంది అంటారు. అలాంటి వారిలో ఏచూరి ఒక్కరేనని బలంగా నమ్ముతున్నట్లు కేటీఆర్ తెలిపారు.
తిట్లు, బూతులు, రోత మాటలతో రాజకీయంగా చలామణి అవుతున్న ఈ రోజుల్లో ఏచూరి హుందాతనం భవిష్యత్తు నాయకులకు ఒక పాఠం అని చెప్పకతప్పదన్నారు. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో జైలు జీవితం తర్వాత భారతదేశంలో నాడు అత్యున్నత స్థానంలో ఉన్న ఇందిరాగాంధీ ముందు నిలబడి ఒక సామాన్య విద్యార్థి నాయకుడిగా, ఒక్క మాట కూడా తొణకకుండా మీరు రాజీనామా చేయండని మాట్లాడాలంటే ఎంత గుండె ధైర్యం కావాలో ఆలోచించండి. రాజ్యాంగాన్ని రాజకీయం కోసం అపహాస్యం ఈ రోజుల్లో రాజ్యాంగాన్ని త్రికరణశుద్ధితో నమ్మిన వ్యక్తి సీతారం ఏచూరి. ప్రశ్నించడమే ప్రజాస్వామ్యం అని గుండెల నిండా నమ్మిన వ్యక్తి ఆయన. పదవులతోనే కీర్తి వస్తుందని కొందరు అనుకుంటారు. కానీ పదవులు లేకున్నా ఐడియాలజీ, ప్రజా సమస్యల పట్ల అవగాహన, పనిచేయాలన్న తపన, నిత్యం ప్రజా సంక్షేమం కోసం పనిచేసే ఆలోచన, నిత్యం కొత్తది నేర్చుకోవాలనే అభిలాష, ప్రజల మనసుల్లో చిరస్థాయిగా చిరంజీవిగా నిలబడేలా చేస్తుంది అనడానికి ఏచూరి జీవితం ఒక ఉదాహరణగా భావిస్తున్నాని కేటీఆర్ పేర్కొన్నారు.