బీజేపీ తెంపరితనం.. రిజర్వేషన్లపై ఎందుకింత విషం..?

ముస్లింలకు తాము వ్యతిరేకం కాదంటూనే హిందూ ఓట్లను ఏకం చేసేందుకు అమిత్ షా నీఛ రాజకీయాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వినపడుతున్నాయి.

Advertisement
Update:2024-04-25 17:16 IST

తెలంగాణలో ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్లను తొలగిస్తామని మరోసారి స్పష్టం చేశారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. సిద్ధిపేటలో జరిగిన బీజేపీ ప్రచార సభలో పాల్గొన్న ఆయన పదే పదే విద్వేష వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ల పేరుతో సమాజంలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నారాయన. ఆ రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీలకు అమలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు అమిత్ షా. ముస్లింలకు తాము వ్యతిరేకం కాదంటూనే హిందూ ఓట్లను ఏకం చేసేందుకు అమిత్ షా నీఛ రాజకీయాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వినపడుతున్నాయి.


తెలంగాణలో కనీసం 12 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలని కోరారు అమిత్ షా. దేశవ్యాప్తంగా 400కు పైగా స్థానాల్లో కమలాన్ని వికసింపజేయాలని అన్నారు. మెదక్ లో రఘునందన్ రావుకి మద్దతుగా నిర్వహించిన ‘బీజేపీ విశాల జన సభ’ లో పాల్గొన్న అమిత్‌ షా.. శ్రీరాముడి ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. రామమందిర నిర్మాణం కాంగ్రెస్ కి ఇష్టం లేదని, అందుకే కేసులు వేసి అడ్డుకోవాలని చూశారని అన్నారు అమిత్ షా. కోర్టు వివాదంలో గెలిచి.. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి మోదీ కృషి చేశారన్నారు. కాశ్మీర్‌ను భారత్‌లో శాశ్వతంగా అంతర్భాగం చేయాలన్న పట్టుదలతో ముందుకెళ్తున్నామని చెప్పారు. మోదీని మూడోసారి ప్రధానిని చేస్తే అవినీతి అంతానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు అమిత్ షా.

మజ్లిస్ పార్టీ అంటే కాంగ్రెస్, బీజేపీకి భయం అని అన్నారు అమిత్ షా. అందుకే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని వారు నిర్వహించలేకపోతున్నారని చెప్పారు. తెలంగాణలో బీజేపీ బలం పెరగాలని, దేశవ్యాప్తంగా వచ్చే 400 సీట్లలో తెలంగాణ వంతు కూడా ఉండాలని అన్నారు అమిత్ షా. 

Tags:    
Advertisement

Similar News