తెలంగాణకు అమిత్ షా.. ఈసారయినా ఫలితం ఉంటుందా..?

బరిలో నిలిచేందుకు నాయకులు ఉన్నా కూడా.. బీఆర్ఎస్ ని బలహీనపరిచేందుకు ఆ పార్టీ అసంతృప్తులకు గేలమేస్తోంది బీజేపీ.

Advertisement
Update:2024-03-07 08:09 IST

షా వస్తున్నాడు, శివాలెత్తేస్తాడు.. అంటూ బీజేపీ నేతలు పదే పదే చెప్పుకుంటున్నా తెలంగాణలో మాత్రం అమిత్ షా పప్పులు ఉడకడంలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెల్చుకున్న తర్వాత పార్టీ కాస్త పుంజుకుందని అనుకున్నా.. 2023 అసెంబ్లీ ఎన్నికలనాటికి మళ్లీ చతికిలపడింది. అధికారంలోకి వస్తామన్న కల నెరవేరకపోయినా కనీసం డబుల్ డిజిట్ అందుతుందని అనుకున్నా లాభం లేదు. 4 ఎంపీ సీట్లు గెల్చుకున్న పార్టీ, అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 చోట్ల మాత్రమే గెలిచి.. ఓట్లు, సీట్లు పెరిగాయని చంకలు గుద్దుకుంటోంది. అయితే ఇప్పుడు ఆ నాలుగు ఎంపీ సీట్లను నిలబెట్టుకోవడం కూడా బీజేపీకి కష్టమనే చెప్పాలి. ఎందుకంటే.. తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంది, బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత కసిగా ఉంది. ఈ రెండు పార్టీలను ఎదిరించి బీజేపీ తన పట్టు నిలబెట్టుకోవడం ఈసారి కష్టమేనని చెప్పాలి.

షా మంత్రాంగం ఫలించేనా..?

ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. ఢిల్లీ బ్యాచ్ రాష్ట్రంపై వాలిపోతుంది. ఇటీవలే ప్రధాని మోదీ రెండు రోజులపర్యటనకు వచ్చి వెళ్లారు, ఇప్పుడు అమిత్ షా వస్తున్నారు. ఈనెల 12న తెలంగాణలో అమిత్ షా పర్యటన ఖరారైంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడేలోగా రాష్ట్ర పార్టీకి దిశానిర్దేశం చేసేందుకు ఆయన వస్తున్నారని సమాచారం. ఈనెల 12న హైదరాబాద్‌ లోని ఎల్‌బీ స్టేడియంలో పోలింగ్‌ బూత్‌ కమిటీలు, నాయకులు, కార్యకర్తలతో అమిత్‌ షా ప్రత్యేకంగా సమావేశం అవుతారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇలాగే అమిత్ షా హడావిడి చేశారు. కానీ ఫలితం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా కాంగ్రెస్ కి ట్రాన్స్ ఫర్ అయింది కానీ బీజేపీకి పెద్దగా లాభం లేకుండా పోయింది. ఈసారయినా షా మంత్రాంగం ఫలిస్తుందో లేదో చూడాలి.

బరిలో నిలిచేందుకు నాయకులు ఉన్నా కూడా.. బీఆర్ఎస్ ని బలహీనపరిచేందుకు ఆ పార్టీ అసంతృప్తులకు గేలమేస్తోంది బీజేపీ. సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని, కాంగ్రెస్ కి ఓటు వేసినా వృథాయేనని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. అభ్యర్థుల ప్రకటన విషయంలో కూడా కమలదళం దూకుడుమీదుంది. ఇప్పటికే 9 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించి ఆ తర్వాత అమిత్ షా హైదరాబాద్ కి వస్తారని అంటున్నారు.

లోక్ సభ ఎన్నికలకోసం బీజేపీ కూడా వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తోంది. తెలంగాణకోసం ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటించాలని చూస్తోంది. దీనికోసం ఇప్పటికే వివిధ వర్గాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నారు. అధికార కాంగ్రెస్‌, విపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీలపై చార్జిషీట్లు విడుదల చేసేందుకు కూడా బీజేపీ కసరత్తులు చేస్తోంది. 

Tags:    
Advertisement

Similar News