అమిత్ షా ఆహ్వానించినా వెళ్లలేదు.. కారణం ఏంటో చెప్పిన యాక్టర్ నిఖిల్
తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు లేవని నిఖిల్ చెప్పారు. నేను తీసే సినిమాలకు, రాజకీయాలకు లింక్ పెట్టొద్దని అన్నారు.
కేంద్ర మంత్రి అమిత్ షాను కలవాలంటూ తనకు ఆహ్వానం అందిందని.. అయితే సినిమాలు తీస్తున్న సమయంలో రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిదనే తాను వెళ్లలేదని టాలీవుడ్ యాక్టర్ నిఖిల్ అన్నారు. తనను ఆహ్వానించినందుకు అప్పట్లోనే అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపానని.. ఎందుకు రాలేక పోతున్నానో కూడా వివరించానని చెప్పుకొచ్చారు. అమిత్ షా కూడా తాను కలవనందుకు నొచ్చుకోలేదని.. తన పరిస్థితిని అర్థం చేసుకున్నారని నిఖిల్ తెలిపారు.
తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు లేవని నిఖిల్ చెప్పారు. నేను తీసే సినిమాలకు, రాజకీయాలకు లింక్ పెట్టొద్దని అన్నారు. కృష్ణుడి మీద భక్తి భావంతో 'కార్తికేయ-2' సినిమా తీశాను. ఇప్పుడు దేశభక్తితో.. నిజాయితీగా స్పై సినిమాను మీ ముందుకు తీసుకొని వస్తున్నానని చెప్పారు.
కార్తికేయ-2 సినిమా సక్సెస్ తర్వాత యువ కథానాయకుడు నిఖిల్ 'స్పై' అనే సినిమాతో ముందుకు వస్తున్నాడు. సుభాశ్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న మిస్టరీ నేపథ్యంలో 'స్పై' సినిమా తెరకెక్కిస్తున్నారు. గ్యారీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా నిఖిల్ సినిమాకు సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు.
కల్యాణ్ రామ్ తెరకెక్కిస్తున్న 'డెవిల్', 'స్పై' సినిమాల కథలు రెండూ ఒకటేననే టాక్ వినిపిస్తోందని నిఖిల్‌ను ప్రశ్నించగా.. రెండు డిఫరెంట్ స్టోరీలని నిఖిల్ చెప్పారు. కల్యాణ్ రామ్ సినిమా 1920 నేపథ్యంలో సాగుతుంది. స్పై సినిమా మాత్రం నేటి కాలంలో కొనసాగుతుందని చెప్పారు. ఈ రెండు సినిమాలకు ఎలాంటి సంబంధం లేదని నిఖిల్ చెప్పారు. స్పై సినిమా కోసం నిజమైన రా ఏజెంట్ల లాగా శిక్షణ తీసుకున్నామని నిఖిల్ చెప్పారు. ఈ సినిమాను తప్పకుండా కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నాయకులకు చూపిస్తామని చెప్పారు.