ఎమ్మార్పీఎస్ నేతలతో అమిత్ షా చర్చలు.. అంత రహస్యం ఎందుకు..?

రహస్యంగా ఎమ్మార్పీఎస్ ప్రతినిధులతో అమిత్ షా చర్చించినట్టు తెలుస్తోంది. చర్చల సారాంశంపై ఒక్క స్టేట్ మెంట్ కూడా విడుదల కాలేదు. ఎమ్మార్పీఎస్ నేతలకు అమిత్ షా ఏమని ఉపదేశమిచ్చారు..? ఎన్నికల్లో వారి సాయం ఎలా కోరారు..? అనేది చర్చనీయాంశంగా మారింది.

Advertisement
Update:2023-11-19 07:55 IST

ఎన్నికల వేళ సభలు, సమావేశాలకు ఎంత ప్రచారం ఉంటే అంత మంచిది అనుకుంటారు నేతలు. బీజేపీ కూడా అమిత్ షా ఒక్కరోజు పర్యటనకోసం బాగానే హడావిడి చేసింది. మూడుచోట్ల సభలు, చివరకు మేనిఫెస్టో విడుదల.. ఇలా పక్కా ప్లానింగ్ తోనే అన్నిటికీ మీడియా కవరేజ్ ఉండేలా చేశారు. కానీ అమిత్ షా ఢిల్లీ వెళ్లబోయే ముందు ఎమ్మార్పీఎస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీకి మాత్రం మీడియాకు అనుమతి ఇవ్వలేదు. కనీసం బీజేపీ సోషల్ మీడియా విభాగాల్లో కూడా ఆ ప్రస్తావన లేనే లేదు.

సికింద్రాబాద్ జువెల్ గార్డెన్‌ లో ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అమిత్ షా, కిషన్ రెడ్డి హాజరయ్యారు. స్వయంగా మందకృష్ణ మాదిగ వీరిద్దరికి స్వాగతం పలికారు. తెలంగాణ, ఏపీ, కర్నాటక రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. మీడియాను మాత్రం ఈ సమావేశానికి నిర్వాహకులు అనుమతించకపోవడం విశేషం.

రహస్యంగా ఎమ్మార్పీఎస్ ప్రతినిధులతో అమిత్ షా చర్చించినట్టు తెలుస్తోంది. చర్చల సారాంశంపై ఒక్క స్టేట్ మెంట్ కూడా విడుదల కాలేదు. ఎమ్మార్పీఎస్ నేతలకు అమిత్ షా ఏమని ఉపదేశమిచ్చారు..? ఎన్నికల్లో వారి సాయం ఎలా కోరారు..? అనేది చర్చనీయాంశంగా మారింది. ఎస్సీ వర్గీకరణకు బీజేపీ సానుకూలం అనే అంశాన్ని గతంలో ప్రధాని మోదీ బహిరంగంగానే ప్రకటించారు. అదే విషయాన్ని బీజేపీ మేనిఫెస్టోలో కూడా చేర్చారు. దళితుల ఓట్లు గుంపగుత్తగా తమకే పడేలా ప్రణాళికలు రచించారు. అయితే ఈ పాచిక పారుతుందా లేదా అనేది ఈనెల 30న తేలిపోతుంది. బీజేపీ మాత్రం ఎమ్మార్పీఎస్ మద్దతు తమకేనని చెబుతోంది. 

Tags:    
Advertisement

Similar News