తెలంగాణకు అమిత్ షా, యోగి.. సెకండ్ లిస్ట్ రిలీజ్ డేట్ ఫైనల్
ఈ నెలాఖరులో తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పార్టీ తరపున ప్రచారం చేస్తారని చెప్పారు.
తెలంగాణలో నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం 52 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన బీజేపీ.. సెకండ్ లిస్టు రిలీజ్‌పై దృష్టిపెట్టింది. మరో రెండు మూడు రోజుల్లో సెకండ్ లిస్ట్ విడుదల చేయనున్నట్లు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక ప్రచారాన్ని సైతం ముమ్మరం చేయనున్నట్లు ప్రకటించారు.
తెలంగాణలో అగ్రనాయకుల పర్యటన ఫైనల్ అయిందన్నారు కిషన్ రెడ్డి. ఈ నెలాఖరులో తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పార్టీ తరపున ప్రచారం చేస్తారని చెప్పారు. అక్టోబర్ 27న అమిత్ షా తెలంగాణకు వస్తారని.. యోగీ ఆదిత్యనాథ్ సైతం నెలాఖరులో తెలంగాణలో పర్యటిస్తారని చెప్పారు.
అక్టోబర్ 10న ఆదిలాబాద్ బహిరంగ సభలో పాల్గొన్న అమిత్ షా తెలంగాణలో తన ప్రచారాన్ని ప్రారంభించారు. వీరితో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్రమంత్రులు, పియూష్ గోయల్, స్మృతి ఇరానీ, సాద్వి నిరంజన్ జ్యోతి.. ఇప్పటికే తెలంగాణలో పర్యటించి పలు బహిరంగ సభల్లో ప్రసంగించారు.