అమీన్ పూర్‌లో హైడ్రా కూల్చివేతలు..ప్రజల్లో భయాందోళనలు
సంగారెడ్డి అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు
సంగారెడ్డి నియోజకవర్గం అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా కూల్చివేతలు ప్రారంభమాయ్యాయి. ఇవాళ వందనపురి కాలనీలో 848 సర్వే నంబర్లో నిర్మాణాలపై కొరడా ఝళిస్తున్నారు. రోడ్డును ఆక్రమించిన ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు భారీ యంత్రాలతో కూల్చివేతలు చేపటడుతున్నారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. అయితే.. హైడ్రా కూల్చివేతలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
ఎప్పుడు ఎవరి ఇంటిని కూల్చివేస్తారో అని భయాందోళనలో ఉన్నారు. హైడ్రా కూల్చివేతలపై పలు చోట్ల ప్రాణాలు అడ్డుపెట్టి పోరాటం చేస్తున్నారు. పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించగా.. హైడ్రా చట్టబద్ధతపై కోర్టు కూడా ప్రశ్నించింది. జీవో 99పై స్టే ఇవ్వాలంటూ అనేక మంది హైకోర్టులో పిటిషన్‌లు వేశారు. ఈ క్రమంలో హైడ్రాకు ఎదురవుతున్న ఆటంకాలు తొలగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ రూపకల్పన చేసింది. ఈ ఆర్డినెన్స్‌ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేశారు.